దేశ రాజకీయాల్లో జగన్ కీలకం కాబోతున్నారా..? వైసీపీకి కేంద్రంలో చక్రం తిప్పే రోజు వస్తుందా..? ప్రధానిని నిర్ణయించే భాగస్వామ్య పక్షాల్లో వైసీపీ నిర్ణయం ప్రధానం అవుతుందా..?
ఏమో.. హస్తిన రాజకీయాల్ని పరిశీలిస్తే ఇదే నిజం అని అర్థమవుతోంది. 22మంది ఎంపీల బలమున్న వైసీపీలాంటి పార్టీ అధికారపక్షంలో భాగస్వామిగా ఉంటే కనీసం మూడు మంత్రి పదవులు వచ్చి ఉండేవి. కానీ జగన్ అలాంటిపని చేయలేదు. ఎన్ని ఆహ్వానాలు వచ్చినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించారు. బీజేపీతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు.
ఇప్పుడు టైమొచ్చింది..
కేంద్రంలో బీజేపీ ప్రాభవం తగ్గుతుందనే విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. అదే సమయంలో మోదీని పడగొట్టేది ఎవరనేది చర్చకు వస్తోంది. కాంగ్రెస్ కి అంత సీన్ లేదని తెలిసినా.. ప్రతిపక్షాలన్నిటినీ కూడగట్టే శక్తి కాంగ్రెస్ కి మాత్రమే ఉందని అనుకుంటున్నారు.
ఈ దశలో కాంగ్రెస్ అంటే పడని పార్టీలు, సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పోరాడే పార్టీలు మోదీ వ్యతిరేక కూటమికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో ఇలాంటి అవరోధాలకు, అడ్డంకులకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం ఆమె ఎదురు చూస్తున్నారు.
యూపీఏ లేదు బొక్కా లేదు అంటూ.. మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. మరోవైపు శరద్ పవార్ కాంగ్రెస్ సహా, బీజేపీయేతర పక్షాలన్నిటినీ ఏకం చేస్తామంటున్నారు. అయితే బీజేపీతో జరిగే పోరాటంలో కాంగ్రెస్ ని తొక్కేయాలని మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటివారు చూస్తున్నారు.
అదే నిజమైతే.. కాంగ్రెస్ ని బద్ధశత్రువులా భావించే వైసీపీకి నిజంగా శుభవార్తే. బీజేపీకి ఫలితం తేడా కొడితే.. అప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వైసీపీ కీలకం అవుతుంది. 2024లో టీడీపీకి అంత సీన్ లేదు కాబట్టి.. వైసీపీకే మళ్లీ అధిక ఎంపీ సీట్లు దక్కుతాయి. అప్పుడు జగన్, ఢిల్లీలో కీలకంగా మారుతారు.
కుడి ఎడమైనా పర్లేదు..
ఒకవేళ బీజేపీయేతర కూటమికి అవకాశం లేకపోయినా.. బీజేపీకైనా వైసీపీ అవసరం ఉంటుంది. సో.. కేంద్రంలో ఎవరెవరు కొట్టుకుని ఎలాంటి ఫలితం వచ్చినా ఫైనల్ గా వైసీపీకి లాభం చేకూరుతుందనడంలో అతిశయోక్తి లేదు. అంటే 2024లో కేంద్రంలో వైసీపీ చక్రం తిప్పబోతోందనమాట.