ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు సంస్థల పేర్లతో చంద్రబాబు కోసం పని చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేక హోదా సాధన సమితి పెట్టుకున్న చలసాని శ్రీనివాస్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో గత కొన్నేళ్లుగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సమితిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కీలక నాయకుడు కూడా. సీపీఐ కార్యాలయం కేంద్రంగా జరిగిన సమావేశంలో పవన్‌పై చలసాని ఘాటు విమర్శ చేశారు.
ఏపీ విషమ పరిస్థితిలోకి నెట్టివేయబడుతోందని చలసాని శ్రీనివాస్ వాపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం, నయ వంచన చేస్తోందని ధ్వజమెత్తారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ అడుగులకు పవన్‌కల్యాణ్ మడుగులొత్తుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీ పాలకులు ఢిల్లీ చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమ గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడ్డం లేదని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో నెలకున్న సమస్యలపై ఎవరూ మాట్లాడ్డం లేదని ఆయన వాపోయారు. వైసీపీని గద్దె దించే ఎజెండాతో కాకుండా అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పని చేయాలని ఆయన హితవు పలికారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ చోద్యం చూస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. సీపీఐ కార్యాలయం కేంద్రంగా పవన్‌పై చలసాని విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ నుంచి పవన్‌కల్యాణ్ బయటికి రావాలని సీపీఐ కోరుతోంది. టీడీపీ, జనసేనలతో కలిసి సీపీఐ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం చూపుతోంది. అయితే సీపీఐ ఆశ ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.