చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారి స్పందించారు. అది కూడా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై చెలరేగారు.
చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారని సీఎం అన్నారు. అలాంటి నాయకుడిని కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడిందని జగన్ అన్నారు. చట్టం ఎవరికైనా సమానమే అని ఆయన అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు రిమాండ్‌కు పంపిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని సీఎం జగన్ తేల్చి చెప్పారు.
దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు బాబు పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టారని సీఎం చెప్పారు. అవినీతి కేసులో అరెస్ట్ అయినా…ప్రశ్నిస్థానన్న వ్యక్తి ప్రశ్నించడంటూ పవన్‌కు పరోక్షంగా జగన్ చురకలు అంటించారు. అవినీతి పరుడికే మద్దతు ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎంత దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు కొందరు ప్రయత్నించినా.. చట్టం ఎవరికైనా ఒక్కటేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని జగన్ గుర్తు చేశారు.
ఆ ఆడియో టేపులో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ఇచ్చినా.. కొందరు బాబు చేసింది నేరమే కాదని వాదించారని తప్పు పట్టారు. గజదొంగను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నిస్తోందని ఘాటు విమర్శ చేశారు. చంద్రబాబు అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు కనిపిస్తున్నా బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కొందరు నిస్సిగ్గుగా మద్దతుగా నిలుస్తున్నారని దుయ్యబట్టారు.
45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం విమర్శించారు. బాబు అవినీతిని దత్త పుత్రుడు ప్రశ్నించడు, ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదని ఆయన విరుచుకుపడ్డారు. వాళ్లందరికీ వాటాలు పంచుతాడు కాబట్టే చంద్రబాబు అవినీతిపై వారెవ్వరూ ప్రశ్నించరని జగన్ అన్నారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు, ములాఖత్‌లో మిలాఖత్ చేసుకొని పొత్తు పెట్టుకునేది ఇంకొకడని ఆర్కే, పవన్‌లను రాజకీయంగా జగన్ చితక్కొట్టారు.
చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. రూ.371 కోట్ల జనం సొమ్ము ఎక్కడికిపోయిందని సీఎం నిలదీశారు. ప్రజలంతా ఆలోచన చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడాలని విన్నవించారు. మంచి జరిగిందని భావిస్తే అంతా జనసైనికుల్లా తనకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు.