మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి 1983లో టీడీపీ తరపున ఎన్నికల ప్రస్థానాన్ని తుమ్మల ప్రారంభించారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్ నేత జలగం ప్రసాద్‌రావు చేతిలో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో ఆయన విజయం సాధించారు. ఆ నియోజక వర్గం నుంచి పలు దఫాలు గెలుస్తూ, ఓడుతూ తుమ్మల తన రాజకీయాన్ని కొనసాగించారు.
టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. 2009లో సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. 2009లో ఖమ్మం నుంచి తుమ్మల గెలుపొందారు. ఏపీ విభజన తర్వాత 2014లో ఆయన బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. పాలేరు ఉప ఎన్నికలో ఆయన గెలుపొందారు. 2018 వచ్చే సరికి కాంగ్రెస్ నేత కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్‌లో కందాళ చేరారు. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జాబితాలో తుమ్మలకు చోటు దక్కలేదు.
దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మల అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో తుమ్మలను కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, భట్టీ విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తుమ్మల రాజీనామా చేశారు.
సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువాను ఆయన కప్పుకోనున్నారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌కు వ్యతిరేక రాజకీయాలు నడిపిన తుమ్మల, అదే పార్టీలో చేరనుండడం చర్చనీయాంశమైంది. తుమ్మల చేరికను కాంగ్రెస్ శ్రేణులు ఎంత వరకు స్వాగతిస్తాయో చూడాలి.