మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి పూర్తిగా మతిపోయిందనే అనుమానాన్ని వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈయన ఆ నియోజకవర్గం నుంచి ఐదారుసార్లు ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో మాజీ మంత్రి డీఎల్ రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. 2014లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌కు మద్దతు ప్రకటించారు.
మైదుకూరులో డీఎల్ రవీంద్రారెడ్డి మాటను మన్నించి ఓట్లు వేసే ప్రజానీకం లేరని అప్పుడు అర్థమైంది. ఆ ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ ఓడిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, డీఎల్‌ను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో టీడీపీపై కోపాన్ని పెంచుకున్నారు. అప్పటి వరకూ వైసీపీని విమర్శిస్తున్న డీఎల్ ఎన్నెన్నో తంటాలు పడి ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ప్రకటించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ డీఎల్‌ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వైసీపీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కోపాన్ని పెంచుకున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ ఉనికి కోసం డీఎల్ తహతహలాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను బయట పెట్టుకున్నారు. అయితే ఆయన్ను ఏ పార్టీ ఆదరించి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ, జనసేనలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా డీఎల్ మీడియా అటెన్షన్ కోసం ఎప్పట్లాగే వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఓటు వేసినందుకు తన చెప్పుతో తానే కొట్టుకోవాలనే దురదృష్టకర పరిస్థితి ఏర్పడిందని సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సహజంగానే ఎల్లో మీడియాకు ఇష్టమైనవి. అయితే మైదుకూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మరోలా వుంది.
డీఎల్ లాంటి నాయకుడిని దగ్గరికి తీసుకునే పార్టీలు తమ చెప్పుతో తాము కొట్టుకోవాల్సి వస్తుందని మైదుకూరు ప్రజానీకం హెచ్చరిస్తోంది. చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత చందాన… ప్రజలు ఆదరించకపోయినా, ఇంకా పదవీ వ్యామోహం పోలేదని డీఎల్‌పై ప్రజానీకం విమర్శలు చేస్తోంది. మతిస్థిమితం సరిగా ఉన్న వాళ్లెవరూ డీఎల్ మాదిరిగా మాట్లాడరని వారు అంటున్నారు.