జగన్ జైలుకి వెళడం ఖాయమని, ఆయన స్థానంలో భారతి సిఎం అవుతారు అని టిడిపి చాలాకాలంగా ప్రచారం చేస్తూ వచ్చింది. సిఎం మాత్రమే అవుతారా, లేక పార్టీ అధ్యక్షురాలు కూడా అవుతారా అని నేను ఆశ్చర్య పడుతూ ఉండేవాణ్ని. భర్త 14 ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నా భారతి రాజకీయాల్లోకి దిగలేదు. వ్యాపారాలు చూసుకునేవారికి రాజకీయాలపై అవగాహన తెచ్చుకునేటంత సమయం ఉంటుందా? పార్టీలో అయితే చాలామంది నాయకులుంటారు. గతంలో అయితే విజయలక్ష్మి గారున్నారు. ఇప్పుడావిడ దూరమయ్యారు. శర్మిలను ఏ రాజ్యసభ ఎంపీ గానో చేసి ఉంటే, ఆమె వచ్చి కూర్చునేదేమో, యిప్పుడా ఛాన్సు లేదు. ఎవరూ తేలక భారతియే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కావచ్చు. ఏ అవినాశ్ రెడ్డో (జైలుకి వెళ్లకపోతే) పక్కనుండి చక్రం తిప్పుతారేమో!
జగన్ జైలు కెళ్లిన రోజుల్లో అయితే పార్టీ నిర్వహణ ఒకటే బాధ్యత. ఇప్పుడతను సిఎం కూడా. సిఎం పోస్టు సంగతికి వస్తే, కాబినెట్లో రెండో స్థానం ఎవరిది? ఉప ముఖ్యమంత్రులు అంతమంది ఉంటే ఎవర్ని కూర్చోబెడతారు? సాధారణంగా హోం మంత్రికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ వనిత గారు పొలిటికల్లీ లైట్ వెయిట్. బుగ్గన కేమైనా ఛాన్సిస్తారా లేక భారతే సిఎం అవుతారా? ప్రభుత్వ నిర్వహణ ఆషామాషీ కాదు. లాలూ జైలుకి వెళ్లినపుడు భార్య రబ్డీ దేవిని సిఎం కుర్చీలో కూర్చోబెట్టి జైలు నుంచి తన అనుచరుల ద్వారా పాలన నడిపేశాడట. తమిళనాడులో ఎమ్జీయార్ పోయాక భార్య జానకిని సిఎం చేసి ఎమ్జీయార్ ముఖ్య అనుచరుడు, మంత్రి వీరప్పన్ చక్రం తిప్పేశాడు. ఎమ్జీయార్‌కి నిజమైన వారసురాల్ని నేనే అంటూ జయలలిత రోడ్డెక్కింది. జానకికి పరిపాలన చేతకాలేదు. ఎన్నికలు వచ్చాయి. రెండు వర్గాలుగా జానకి, జయలలిత పోటీ పడి ఎడిఎంకె ఓట్లు చీల్చడంతో, డిఎంకె నెగ్గింది. నీతి ఏమిటంటే, భార్య ఐనంత మాత్రాన రాజకీయ వారసత్వం ఆటోమెటిక్‌గా వచ్చేయదు.
ఇన్ని ప్రశ్నలు మన మెదళ్లలో మెదులుతున్నాయి కానీ జగన్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు, ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకున్నట్లు బయటకు కనబడటం లేదు. దిల్లీలో బిజెపితో సఖ్యంగా ఉన్నంత కాలం తను జైలుకి వెళ్లే ప్రమాదం లేదని ధీమా కాబోలు. రాష్ట్రంలో బలంగా ఉంటే చాలు, దిల్లీ ఏమీ చేయలేదనే ధీమాతో తండ్రి మరణం తర్వాత దూకుడుగా వెళ్లాడు. దిల్లీ పవరేమిటో సోనియా బాగా నేర్పింది. కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత దిల్లీతో రాజీ పడకపోతే లాభం లేదని గ్రహించాడు. అతని అదృష్టం కొద్దీ 2004 నుంచి కాంగ్రెసు మసకబారి, బిజెపి వెలుగుతోంది. కనీసం యింకో ఐదేళ్లు దానికి ఢోకా లేదు. దిల్లీ ఏమన్నా సై అంటూ ఉంటే చాలు, కాలక్షేపం చేసేయచ్చు అనుకుంటూన్నాడు.
గతంలో ఎమ్జీయార్ యిలాగే ఉండేవాడు. ‘నేను అడిగినది నా రాష్ట్రానికి యిస్తే చాలు, నాపై అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ నా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయకుండా ఉంటే చాలు, జాతీయ రాజకీయాలు, ఆ స్థాయి విధానాలు నాకు అనవసరం.’ అని మాటిచ్చేవాడు. కేంద్రంలో ఎవరున్నా ఎమ్జీయార్ మద్దతు వాళ్లకే. అలాగే సుఖంగా కాలం గడిచిపోయింది.
కేంద్రంలో కాంగ్రెసు నెగ్గి ఉంటే జగన్‌కు కష్టం వచ్చేది. కానీ అది తన జీవసమాధి తనే కట్టుకుంది. ఇతను బతికిపోయాడు. బిజెపితో బాహాటంగా పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓటు దెబ్బ తింటుంది కాబట్టి పెట్టుకోడు. ఆంధ్రలో ఓటు బ్యాంకు ఉండి ఉంటే, అధికారంలోకి రావాలనే ఆసక్తి ఉంటే బిజెపి స్టాండ్ ఎలా ఉండేదో! బాబు పుణ్యమాని బిజెపికి బేస్ లేకుండా పోయింది. వైసిపి, టిడిపి యిద్దరూ తమకే మద్దతిస్తున్నారు కాబట్టి రాష్ట్రంలోని 25 ఎంపీలు మనవాళ్లే అని బిజెపి ప్రస్తుతానికి ఉపేక్షిస్తోంది. అందుకే జగన్ కేసులను త్వరగా నడిచేట్లు చూడటం లేదు. అతను వారంవారం హాజరు వేయించుకోవాల్సిన కోర్టు కూడా ఊరుకుంటోంది.
అయినా తెలుగు మీడియా, టిడిపి అదిగో జగన్ అడుగులు జైలు వైపే అంటూ వచ్చారు. దిల్లీ ఎప్పుడు వెళ్లినా తన కేసుల గురించి మాట్లాడడానికే వెళ్లారని చెప్తూ వచ్చారు. తీరా చూస్తే యిప్పుడు బాబు అరెస్టయ్యారు. జుడిషియల్ కస్టడీయే అనుకోండి, పది రోజుల (?) భాగ్యానికే ఐనా జైలుకి వెళ్లారు. బాబుని యీ కేసులో యిరికించడానికి కేంద్ర సంస్థలు సహకరించినట్లే తోస్తోంది. ‘జగన్ దిల్లీ వెళ్లి వస్తున్నది అతని కేసుల గురించి మాత్రమే అనుకున్నాం, మన కేసుల గురించా?’ అని టిడిపి ఆశ్చర్యపడే విధంగా జరిగింది.
బాబు ఆరెస్టవుతారని నేనెన్నడూ అనుకోలేదు. అరెస్టయినా వెంటనే గంటల్లో బెయిలు వస్తుందనుకున్నాను. బెయిలు వచ్చేదాకా ఏ రమేశ్ ఆసుపత్రిలోనో ఉంటారనుకున్నాను. కానీ అలా జరగలేదు. పుష్కర దుర్ఘటన జరిగిన రాజమండ్రిలోనే కారాగారానికి వెళ్లారు. జైలు కన్నా యిల్లు పదిలం, హౌస్ అరెస్టనండి అంటే మేజిస్ట్రేటు ఒప్పుకోలేదు. హైకోర్టు కూడా వెంటనే చలించలేదు. కనీసం ఒక వారం బాబు జైల్లో ఉండాల్సి వచ్చేట్టుంది.
బయటకు వచ్చినా మళ్లీ పంపేట్టు ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు రెడీగా పెట్టారట. ఆ ఇన్కమ్ టాక్స్ నోటీసు గొడవొకటి ఉంది. ఐటీ అరెస్టులు చేయదు. మధ్యలో ఈడీ దూరితేనే ప్రమాదం. అందుకే బాబు ఆ మధ్య వెళ్లి అమిత్ షాను కలిశారు. అంత ముఖ్యమైన సమావేశం తర్వాత కూడా రాజకీయపరమైన ప్రకటన ఏమీ లేదేమిట్రా అని ఆశ్చర్యపడ్డాం. ఇప్పుడర్థమైంది, జగన్ తన కేసుల గురించి మాట్లాడిన తరహాలోనే యీయనా మాట్లాడి ఉంటారు. అమిత్ మితంగా మాట్లాడి పంపించేశారు, కలిసినట్లు ట్వీట్ కూడా చేయలేదు. బిజెపి మద్దతు లేకుండా వైసిపి యింత సాహసం చేస్తుందాని అందరికీ సందేహం. అబ్బే, వాళ్ల కేమీ తెలియదు అంటాడు పవన్. మీరేమైనా వైసిపి దుష్పరిపాలన గురించి వారికి ఫిర్యాదు చేశారా అంటే, వాళ్లకన్నీ తెలుసు, మనం చెప్పాలా అంటాడు. ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టం బాబూ.
ఈ స్కిల్ కేసు చివరిదాకా నిలుస్తుందని, లాజికల్ ఎండ్‌కు వస్తుందని నాకేమీ నమ్మకం లేదు. పుష్కరం నాటి జగన్ కేసులే తేలలేదు. నాలుగేళ్ల వివేకా హత్య కేసే తేలలేదు. ఇదెప్పుడు తేలాలి? పెట్టబోయే కేసులదీ యిదే గతి కావచ్చు. కానీ కోర్టుల చుట్టూ తిరిగే, అదృష్టం బాగుండకపోతే జైళ్లకు వస్తూపోయే అవస్థ, చికాకు తప్పకపోవచ్చు. కనీసం ఎన్నికలయ్యేదాకా తిప్పే ప్రయత్నం వైసిపి చేస్తుంది. అలా అయితే సింపతీ వస్తుంది, టిడిపికే లాభం అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే తెలుగుదేశం కార్యకర్తలకు శుభాకాంక్షలు చెపుదాం అన్నారు. టిడిపికి మేలు ఎలా కలుగుతుందో ఆయన వివరించారు.
కేసుల్లో యిరుక్కోకూడదనే బెరుకు స్వభావంతో బాబు యిన్నాళ్లూ పిరికిగా వ్యవహరించారు. ఆ ఆరెస్టుతో ఆయనలో ఆ బెరుకు పోతుంది అంటారు రాధాకృష్ణ! నిండా మునిగితే చలి పోతుందనా? జైలుపక్షి అన్న ముద్ర పడింది కాబట్టి కేసుల్లో యిరుక్కున్నా ఫర్వాలేదన్న ధీమా వస్తుందనా? ఇది 14 రోజుల జుడిషియల్ కస్టడీ మాత్రమే కదా, వచ్చేవారం బయటకు వచ్చేయవచ్చు కదా, యీ మాత్రానికే స్వభావంలో అంత మార్పు వచ్చేస్తుందా?
ఇక లోకేశ్ విషయంలో అయితే రాధాకృష్ణలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ‘పాదయాత్ర చేపట్టడానికి ముందు వరకు ఆయన పప్పు అని జగన్ అండ్ కో చేసిన ప్రచారాన్ని జనం కూడా నమ్మారు.’ అని రాశారు. ఇది లోకేశ్‌కు చాలా డామేజింగ్‌గా అనిపించాలి. ప్రత్యర్థులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అంతమాత్రాన జనం కూడా దాన్ని నమ్మేశారని రాధాకృష్ణ వంటి హితైషులు కూడా ప్రచారం చేస్తే ఎలా?
లోకేశ్ విదేశాల్లో చదివారు, ఆంధ్ర కాబినెట్లో మంత్రిగా చేశారు, పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టారు. ఒక పక్క ఆయన అమరావతి వ్యవహారాల్లో ఎన్నారై మిత్రులతో కలిసి డబ్బు సంపాదించారని ఆరోపిస్తూ మరో పక్క ఆయన ఏమీ చేతకాని వాడనే అర్థంలో పప్పు అని అంటే పొసుగుతుందా? పత్రికలో దాని గురించి ప్రస్తావించ వలసిన అవసరం ఉందా? ఎందుకు ప్రస్తావించారంటే, పాదయాత్ర తర్వాత లోకేశ్‌లో అప్పటివరకు అపరిచితుడిగా ఉన్న పోరాట వీరుడు బయటకు వచ్చాడని ఎస్టాబ్లిష్ చేయడానికి!
పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారట, నాన్పుడు వైఖరి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆ నిర్ణయాలు టిడిపి పార్టీకి సంబంధించినవి. ఆ మేరకు ఆయన తండ్రి ఆయనకు అధికారం యిచ్చి ఉంటారు. దానిలో పోరాటమేమీ లేదు. ఇక జగన్‌ను తిట్టడమంటారా, ఆ పని చాలా ఏళ్లగా చేస్తున్నారు. సైకో, జాంబీ, జగ్లక్.. యిలాటి పదాలన్నీ ఎప్పుడో వాడారు. గతంలో ట్విటర్ వేదికగా తిట్టారు, యిప్పుడు నేల మీదకు వచ్చి తిడుతున్నారు. దీనిలో ఏ వీరత్వం చూశారో ఏమో రాధాకృష్ణ ఆయనను నేతాజీ, భగత్ సింగ్‌లతో పోల్చారు. (కర్మకాలి లోకేశ్ అరెస్టయితే చే గువేరా, చారు మజుందార్లను కూడా లాక్కొచ్చేస్తారు) ఈ రోజుల్లో యువతకు గాంధీ కంటె వీళ్లే ఆరాధ్యులయ్యారు కాబట్టి లోకేశ్ కూడా ఆ కోవలోకి చేరారన్నారు. పనిలో పనిగా సోనియాను ఎదిరించినందుకు గతంలో జగన్‌కు ఎంత ఆదరణ వచ్చిందో, యిప్పుడు లోకేశ్‌కు అంత వచ్చిందంటూ ఖితాబు యిచ్చారు. ఇక అరెస్టు కూడా ఐతే చెప్పనక్కరలేదని పొంగిపోతున్నారు. తండ్రీకొడుకులిద్దరూ జైలుకి వెళితే అత్తాకోడళ్లిద్దరూ ప్రజాక్షేత్రంలోకి రావచ్చు అని ఊహ చేశారు.
ఇదంతా అరెస్టు వలన ప్రజల్లో సానుభూతి వచ్చి టిడిపికి లబ్ధి కలుగుతుంది అనే అంచనాతోనే! సానుభూతి అనగానే ఇందిర ఖలిస్తానీల చేతిలో హత్యకు గురైతే సింపతీ వచ్చి రాజీవ్ నెగ్గిన ఘటనే అందరూ చెప్తారు. నియోజకవర్గ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు చనిపోతే సింపతీ రగిలి, కుటుంబసభ్యులకు లాభం కలుగుతుంది. అంతకు మించి సింపతీ వలన లాభించిన సందర్భాలు కనబడవు. ఎన్టీయార్ పోతే లక్ష్మీపార్వతి పార్టీకి ఓట్లు రాలేదు. చంద్రబాబు చేతిలో మోసపోయానంటూ హరికృష్ణ పార్టీ పెడితే రాలలేదు. చంద్రబాబు చచ్చి బతికిన అలిపిరి ఘటనప్పుడే సింపతీ రాలేదు. మావోయిస్టులకు ఆయనపై వ్యక్తిగతమైన పగ లేదు. ముఖ్యమంత్రి అనే చంపబోయారు. అంటే ప్రజల కోసం మృత్యుముఖంలోకి వెళ్లినట్లే కదా, అయినా ప్రజలు తిరిగి ఎన్నుకోలేదు.
ఎవరైనా సరే, అవినీతి ఆరోపణలపై జైలు కెళితే సింపతీ రాదు. నిరూపణ అయినా కాకపోయినా, ఏదో ఉండే ఉంటుంది అనుకుంటారు. అయితే ఆరోపణ కారణంగా దూరమూ పెట్టరు. వాళ్ల ఓటమికి, గెలుపుకి యితర కారణాలుంటాయి. 1977 నుంచి రెండున్నరేళ్ల పాటు సాగిన జనతా పాలనలో ఇందిరను ఓ అవినీతి కేసు విషయంలో అరెస్టు చేశారు. 1980 ఎన్నికలలో ఇందిర నెగ్గింది. అరెస్టయిందన్న సింపతీ వలన గెలుపు రాలేదు. జనతా పార్టీ అంతఃకలహాల వలన పరిపాలన సాగక, వాళ్ల తీరు ప్రజలకు నచ్చక మళ్లీ ఇందిరను గెలిపించారు.
జనతా పాలనలో ప్రధాని మొరార్జీ, ఉపప్రధాని చరణ్ సింగ్ ఒకరితో ఒకరు మాట్లాడుకునే వారు కాదు. ఏ సూరజ్కుండ్లోనో సమావేశమైతే అదో పెద్ద న్యూస్‌గా ఉండేది. ఇది ప్రజలు ఏ మేరకు హర్షిస్తారో ఊహించండి. కరుణానిధి, జయలలితలు జైళ్లకు వెళ్లారు. కానీ సింపతీల వలన గెలవలేదు. అవతలివారిపై కోపంతో యివతలివాళ్లను గెలిపించారు. 16 నెలలు జైలుకి వెళ్లాడు కదాని జగన్‌కు సింపతీ చూపించి ఉంటే 2014లో నెగ్గేవాడు. 2019లో నెగ్గాడంటే బాబు పాలనే నెగ్గించింది. ఇప్పుడు బాబు నెగ్గినా యీ ఆరెస్టు వలన సింపతీ వలన కాదు, జగన్ పాలనే నెగ్గించినట్లు లెక్క.
ఇవన్నీ బాబుకి తెలియని విషయాలు కావు. సింపతీ వచ్చి లాభం కలుగుతుంది అని టిడిపి సానుభూతిపరులు పైకి చెప్తున్నా, బాబు అలా అనుకోవటం లేదు. అనుకుంటే జైలు వద్దు, యింట్లోనే పెట్టండి అనేవారు కాదు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాములో ముందస్తు బెయిలుకి అప్లయి చేసేవారు కాదు. లూథ్రా యికపై కత్తి తీస్తాననేవాడు కాదు (హార్నీ యిన్నాళ్లూ తీయలేదా?) రాజమండ్రి జైల్లో బండలు కొడుతూ ఫోటో తీయించుకుని ప్రజల్లోకి పంపేవారు. నాతోపాటు లోకేశ్‌నూ పెట్టండి. డబుల్ సింపతీ అనేవారు.
సెప్టెంబరు 10 నాటి ‘‘కొత్త పలుకు’’లో రాధాకృష్ణ భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావచ్చు అన్నారు. భువనేశ్వరి 40 ఏళ్లగా భర్త రాజకీయాలకు దూరంగా, వ్యాపారరంగంలోనే ఉన్నారు. అమరావతి ఉద్యమసమయంలో మాత్రమే సామాజిక స్పృహ అనండి, రాజకీయ స్పృహ అనండి, కనబరిచి గాజులు విరాళంగా యిచ్చారు. ఇప్పుడు భార్యగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్ప, మా ఆయన జైలుకి వెళితేనేం, కార్యకర్తలారా మీకు అండగా నేనున్నాను లాటి స్టేటుమెంట్లు యివ్వటం లేదు. జగన్ మీద రంకెలు వేయడం లేదు. తన హుందాతనాన్ని అలాగే మేన్‌టేన్ చేస్తున్నారు.
రాధాకృష్ణ భువనేశ్వరి, బ్రాహ్మణి అన్నారు కానీ ఆయనే కాదు, ఎవరూ ఊహించని రీతిలో బాబు అరెస్టు కాగానే బాలకృష్ణ అవతరించారు. బాబు సీటులో కూర్చుని టిడిపి ఆఫీసులో మీటింగు నిర్వహించారు. టిడిపి నారా కుటుంబం నుంచి ఒరిజినల్ ఓనర్స్ నందమూరి వారికి తిరిగి వస్తుందాని పించింది. రాజకీయాల్లో ఫుల్‌టైమ్ లేని, తన నియోజకవర్గంలో తప్ప తక్కిన చోట్ల క్షేత్రస్థాయి కార్యకర్తలతో పరిచయాలు లేని బాలకృష్ణ ఆపద్ధర్మంగా వచ్చి కూర్చోవడ మేమిటనిపించింది. ఏ యనమలో, గోరంట్లో, పయ్యావులో కూర్చోవచ్చుగా! వాళ్లయితే తను వచ్చేలోపున గ్రూపులు కడతారన్న భయం బాబుకుందేమో! బాలకృష్ణ అయితే పిల్ల నిచ్చుకున్న వియ్యంకుడు. తప్పుకో అంటే తప్పుకుంటాడు. పైగా పార్టీ వ్యవస్థాపకుడి కొడుకు మాత్రమే కాదు, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. లోకేశ్‌కు ఆ భాగ్యం ఒక్కసారీ దక్కలేదు. లోకేశ్ తన స్థానంలో కూర్చుంటే సీనియర్లు గౌరవించరు. అదే బాలకృష్ణ అయితే భక్తి కాకపోయినా, భయం ఉంటుంది అని బాబు లెక్క వేసి ఉంటారు. ఇదే అదనని బాలకృష్ణ ఓదార్పు యాత్రకు బయలుదేరతా నంటున్నారు.
వీళ్లంతా కూర్చుని ఏం చర్చించి ఉంటారు? బాబు జైల్లో ఉంటూనే రిమోట్‌తో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఎలాగూ బయటకు వచ్చేస్తారు. ఈ లోపున మనం పరిస్థితిని హేండిల్ చేయడం ఎలా? అని కాబోలు. చంద్రబాబు అరెస్టు కాగానే నాదెండ్ల వెన్నుపోటు నాటి లెవెల్లో తిరుగుబాటు వస్తుందని అనుకున్నా అదేమీ జరగలేదు. పోలింగు రోజు వచ్చే వార్తల్లోలా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప చెప్పుకోదగ్గ ప్రతిఘటన లేదు. సెప్టెంబరు 10 నాటి కొత్త పలుకులో రాధాకృష్ణ ‘అంగళ్లు సంఘటన తర్వాత టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆలోచనతో, సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి అవకాశం యివ్వకుండా జాగ్రత్తగా మెలుగుతున్నారు..’ అని రాశారు. 10 రాత్రి బాబు జైలుకి వెళ్లారు. అయినా అప్పణ్నుంచి టిడిపి వాళ్లు ‘సంయమనం’తోనే ఉన్నారు.
ప్రభుత్వం సెక్షన్ 144 పెట్టింది కాబట్టి బందులూ అవీ పెద్దగా జరగటం లేదు అనేది ఒప్పుకోలేము. పుంగనూరులో చూడలేదా? ప్రజలు ఒక్కుమ్మడిగా విరుచుకు పడితే పోలీసులే కళ్లూ, కాళ్లూ పోగొట్టుకుంటారు. నాదెండ్ల ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టింది? అయినా ప్రజలు ఆగారా? బెంగుళూరులో, విప్రో సర్కిల్లో, అమెరికాలో ప్రదర్శనలు చేసినవాళ్లు, బాబుని పొగిడిన రజనీకాంత్ ఆంధ్ర ఓటర్లు కాదు కదా! సామాన్యులు కన్నెర్ర చేస్తేనే ఫలితాలు కనబడతాయి. బాబు అరెస్టు తర్వాత జాతీయ స్థాయి నాయకులు నిరసన తెల్పుతారేమో అనుకుంటే అవీ అంతంతమాత్రం గానే ఉన్నాయి. అతి జాగ్రత్తతో బాబు ఏ గ్రూపుకీ చెందకుండా తటస్థంగా ఉండడంతో పరిస్థితి యిలా తేలింది. అరెస్టు తీరుని ఖండించారు తప్ప, ఆయన తప్పు చేయలేదు అని ఎవరూ చెప్పలేదు, చెప్పలేరు కూడా.
నార్త్‌లో బాగా పాప్యులర్ అయిన హిందూస్తాన్ టైమ్స్‌లో ఐటీ నోటీసు కథనం రావడం బాబు యిమేజిని దెబ్బ తీసి ఉంటుంది. ఇప్పుడు బాబుని సమర్థించిందాకా ఉండి, కేసు ఓ కొలిక్కి వస్తే (అసలే నిందితుల్లో యిద్దరు విదేశాలకు పారిపోయారు) యీ వంక పెట్టుకుని మోదీ ‘ఇండియా కూటమి అంతా చోర్ మండలీ’ అనేయవచ్చు. స్టాలిన్ కొడుకు సనాతన ధర్మం గురించి అన్న వ్యాఖ్య డిఎంకె పార్టీ స్టాండ్ అని కూడా అనలేం. మా పార్టీ నాయకుల్లో కొందరు గుళ్లకు వెళతారని స్టాలిన్ అన్నాడు కూడా. అయినా మోదీ దాన్ని మొత్తం ఇండియా కూటమికి పులిమేశారు. అలాటి భయంతో ఇండియా వాళ్లు తమాయించుకుని ఉండవచ్చు. ఎన్డిఏ వాళ్లు ఎలాగూ కిమ్మనరు.
దీన్ని టిడిపి ఎలా హేండిల్ చేస్తుందా అనుకుంటూ ఉండగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి హడావుడిగా టిడిపి-జనసేన పొత్తు ప్రకటించారు. పొత్తు అంటే యిరు పక్షాల వారూ మాట్లాడతారు, చేతులు కలిపి పైకెత్తి ఫోటో తీయించుకుంటారు. ఇక్కడ అదేమీ జరగలేదు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ప్రకటనను పవన్ జైలు ముందు నిలబడి ఒంటరిగా చేసేశారు. పక్కనున్న లోకేశ్, బాలకృష్ణ కిమ్మనలేదు. పొత్తును ఆహ్వానిస్తున్నామంటూ చేతులు కలపలేదు, ‘శంఖం పూరించాం, జగన్, నీకు రోజులు దగ్గర పడ్డాయి’ వంటి హుంకరింపులు చేయలేదు. ఒక గంభీరముద్ర మేన్‌టేన్ చేశారు. లోకేశ్ అయితే మొహం చిట్లించుకుని ఉన్నారు కూడా. పవన్ బిజెపిని సంప్రదించారో లేదో తెలియదు. రాష్ట్ర బిజెపి కూడా తమ భాగస్వామి మరొకరితో పొత్తు పెట్టుకోవడంపై ఏమీ వ్యాఖ్యానించలేదు. పవన్ వైఖరి ఎవరికీ అర్థం కావటం లేదు. ఎవరి ఊహాగానాలు వారివి.
నిజానికి చెప్పాలంటే బాబు అరెస్టయి, లోకేశ్ నెత్తి మీద కత్తి వేళ్లాడుతూన్న యీ కష్టకాలం పవన్‌కు కలిసొచ్చే కాలం. వైసిపి వ్యతిరేక ఓటులో తన వాటాను పెంచుకునే సువర్ణావకాశం. టిడిపి క్యాడర్ జాగ్రత్తగా మెలగుతున్న (రాధాకృష్ణ గారి మాటల్లో) యీ సమయంలో తెగింపు ఉన్న తన క్యాడర్ అండతో రాష్ట్రమంతా కలయదిరిగి వైసిపి పాలనను ఎండగట్టి, జగన్‌ని ఎదిరించే దమ్ము టిడిపి కంటే జనసేనకే ఎక్కువుందని నిరూపించుకుని, యిమేజి పెంచుకుని, పొత్తు కుదిరినప్పుడు ఎక్కువ సీట్లు అడగవచ్చు. ఆ ఛాన్సు వదలుకుని తనంతట తానే పొత్తు ప్రకటించడమేమిటి? గౌరవప్రదమైన సీట్లు యిస్తేనే పొత్తు అనే బెట్టును సడలించి, టిడిపి నాయకుల ప్రతిస్పందన ఏమీ లేకపోయినా తనే తొందర పడడమేమిటి? ఇకపై జనసైనికులు రంగంలోకి దిగి, నిరసన కార్యక్రమాలు జోరుగా చేస్తారా?
ఏ మాటకా మాట చెప్పాలంటే జనసైనికుల్లో అంకితభావం ఎక్కువ. కోవిడ్ సమయంలో ప్రతిపక్షాల్లో జనసైనికులు కొన్ని గ్రామాల్లో చాలా సేవలందించారని విన్నాను. పరిణామాల గురించి ఆలోచించకుండా ఆత్మాహుతి దళంలా ముందుకు దూకే వీరాభిమానులు పవన్‌కు ఉన్నారు. వేరే పార్టీ అధ్యక్షుడి కోసం తన పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీద పవళించగా లేనిది, తామెంత అనుకుంటారు వాళ్లు. టిడిపి క్యాడర్ స్తబ్దంగా ఉంది కాబట్టి జనసైనికుల ద్వారా ప్రతిఘటనోద్యమాన్ని నిర్వహించే బాధ్యతను బాబు పవన్‌కు అప్పగించారా? బహిరంగంగా పొత్తు పెట్టుకోనిదే ఆ పని చేసిపెట్టమని అడగడం భావ్యం కాదు కాబట్టి పొత్తు గురించి ప్రకటించడానికి అనుమతించారా? మరి పొత్తు విషయమై తన తరఫున ప్రకటన చేయమని లోకేశ్‌నో, బాలకృష్ణనో, టిడిపి రాష్ట్ర అధ్యక్షుణ్నో ఆదేశించలేదేం?
ఇక్కడే ఒక డౌటు వస్తుంది. ఈ ప్రకటనపై బిజెపి ఏమనుకుంటుందోనన్న భయం ఉండి ఉంటుంది. మోదీ వైజాగ్ వచ్చినపుడు పవన్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని, టిడిపితో పొత్తు కోసం వెంపర్లాడకుండా ఓపిగ్గా తమతోనే ఉండమని సలహా యిచ్చారని వార్తలు వచ్చాయి. అంత విలువ యిచ్చినా యీనాడు పవన్ వారిని అడగకుండా టిడిపి వైపు వెళ్లిపోవడం మోదీకి విస్మయాన్ని, చికాకుని కలిగించి ఉండవచ్చు. పవన్‌ను ఒత్తిడి చేసి బాబు అలా చేయించారనే అనుమానం ఆయనలో కలిగితే బాబుకి యిబ్బందే. అందువలన పవన్‌ది ఏకపక్ష నిర్ణయమే తప్ప, దానిలో తమ పాత్ర లేదని బాబు చూపించ దలచుకున్నారా? లోకేశ్ దిల్లీ వెళ్లేది ఆ మెసేజితోనేనా? తెలియదు.
ముందుగా బిజెపిని ఒప్పించి పవన్ యీ ప్రకటన చేసి ఉంటే బిజెపితో యిబ్బంది లేదు. పోనీ యిప్పుడైనా పోస్ట్-ఫ్యాక్టో రేటిఫికేషన్లా బిజెపి సరేలే అనుకుని ఊరుకున్నా యిబ్బంది లేదు. మీ కూటమిలో నేను కూడా చేరతా అంటే మహబాగు. ప్రస్తుతానికి మాత్రం చిత్రం అస్పష్టంగా ఉంది. జనసేనతో పొత్తు విషయమై టిడిపి హైకమాండ్ నుంచి కూడా ప్రకటన వస్తే చిక్కుముడి విడిపోతుంది. టిడిపి-జనసేన పొత్తు కుదురుతుందని ఎప్పణ్నుంచో తెలిసినా, బేరాలు కుదరకనో, బిజెపి కూడా వస్తుందేమోనని ఆగడం చేతనో యిప్పటిదాకా ప్రకటన రాలేదు. ఇప్పుడీ ప్రకటన వస్తే బాబు అరెస్టే దానికి కేటలిస్టుగా పని చేసిందనుకోవాలి. ఆ మేరకు జగన్‌కు వాళ్లు ధన్యవాదాలు తెలపాలి.