ఏ పార్టీ నాయకుడికైనా లేదా ఏ ముఖ్యమంత్రికైనా సరిగ్గా ఎన్నికల ముందే రకరకాల పథకాలు గుర్తొస్తాయి. కొన్ని వర్గాలవారు అప్పుడే మదిలో మెదులుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు ఉన్నట్లుండి స్కూలు పిల్లకాయలు గుర్తుకొచ్చారు. వాళ్లు గుర్తుకొచ్చారు అనడం కంటే వాళ్ల తల్లిదండ్రుల ఓట్లు గుర్తుకొచ్చాయని అనడం కరెక్టుగా ఉంటుంది.
ఒకప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ససేమిరా అని మొండికేసిన కేసీఆర్ ఎన్నికల్లో లాభం పొందడం కోసమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. మంత్రి మల్లారెడ్డి పుసిక్కిన నోరు జారి ఇది ఎన్నికల స్టంటే అని బహిరంగంగానే చెప్పాడు. సేమ్ స్కూలు పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం కూడా ఇలాంటిదే. నిజంగా స్కూలు పిల్లకాయలకు మంచి చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు కదా. స్కూలు పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలని నిర్ణయించడానికి కారణం కాంగ్రెసు పార్టీ. కాంగ్రెస్ పార్టీకి తాజా నిర్ణయంతో సీఎం కేసీఆర్ షాకిచ్చినట్లయింది.
హైదరాబాద్ నగరంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆరు గ్యారంటీ స్కీంల ప్రకటనకు ముందే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ప్రకటన చేయడం గమనార్హం. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి వాళ్లకంటే ముందుగానే నిర్ణయాలు ప్రకటించడం, పథకాలు ప్రకటించడం కేసీఆర్‌కు మామూలే. బీజేపీ, కాంగ్రెసు పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రకటించేశాడు. దానివల్ల పార్టీలో గొడవలు జరుగుతున్నాయనుకోండి. అది వేరే విషయం.
కాని ప్రతిపక్షాలను ముందే దెబ్బ కొట్టాలని కేసీఆర్ ఎప్పడూ ఆలోచిస్తుంటాడు. అందులో భాగమే స్కూలు పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టే నిర్ణయం కూడా. దసరా నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు. కొందరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయాన్నే కూలి లేదా వ్యవసాయ పనులకు బయలుదేరడంతో వారు అల్పాహారం తినలేని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో ఖాళీ కడుపుతో విద్యార్థులు చదవుపై దృష్టి సారించలేరని గ్రహించిన ప్రభుత్వం ఈ పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే తమ విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించడం ప్రారంభించాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలల పనిదినాలలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుండగా, రాగి జావ విద్యార్థులకు వరం కానుంది.
మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్స్‌ను చేర్చే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైస్కూల్ విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు సార్లు మిల్లెట్స్ అందించే అవకాశం ఉంది. విద్యార్థలకు అల్పాహారం అందించాలని కేసీఆర్ మానవత్వంతో నిర్ణయం తీసుకున్నారని మంత్రులు, అధికారులు చెబుతున్నారు. కాని ఈ మానవత్వం ఇన్నేళ్లుగా ఎటుపోయిందనేదే అసలు ప్రశ్న.