ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకుని తిరిగి వచ్చేశారు. తమ కుటుంబానికి ముప్ఫయ్యేళ్లుగా సేవలందిస్తున్న నారాయణ అనే వ్యక్తి చనిపోవడంతో.. సీఎం తన అధికారిక పర్యటను కూడా అర్థంతరంగా వాయిదా వేసుకుని వచ్చేశారు.
జగన్‌లోని మానవీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న ఉదంతం ఇది. అయితే.. వ్యక్తులను వ్యాపారంగా చూసేవాళ్లు. ప్రజలను ఓట్లుగా మాత్రమే పరిగణించే వాళ్లు ఇలాంటివి అర్థం చేసుకోలేరు. అందుకే .. జగన్ ఢిల్లీనుంచి హఠాత్తుగా తిరిగి రావడంపై యెల్లో మీడియా గానీ.. తెదేపా నాయకులు గానీ.. వక్ర వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
జగన్మోహన రెడ్డి గురువారం సాయంత్రం హఠాత్తుగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఏ పనిమీద ఢిల్లీ వెళ్లారనే సంగతి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఢిల్లీలో ఎవరిని కలుస్తారు.. ఎజెండా ఏమిటి? అనే విషయాలు కూడా ప్రభుత్వం అధికారికంగా అస్సలు వెల్లడించలేదు. కాకపోతే.. మీడియాలో మాత్రం ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకున్నారు.
జగన్ ఢిల్లీ చేరిన గురువారం రోజు రాత్రే పదిన్నర గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షాను కలుస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఊహాగానాలే. హోంమంత్రి భేటీ అవుతున్నారనే పుకారును ఆధారం చేసుకుని… ఏం చర్చించబోతున్నారు.. భేటీ ఎజెండా ఏంటి? అనే విషయాల్లో కూడా ఎవరికి తోచినట్లుగా వారు పుకార్లు పుట్టించారు.
అయితే శుక్రవారం ఉదయం.. జగన్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ మరణించారు. ఆయన ముప్ఫయ్యేళ్లుగా వైఎస్ కుటుంబానికి సేవలందిస్తున్న వ్యక్తి. దాంతో వ్యక్తిగత మానవ సంబంధాలకు విలువ ఇచ్చే అలవాటు ఉన్న జగన్ ఢిల్లీ పర్యటననుంచి ఉన్నపళంగా హైదరాబాదు వచ్చేశారు. నారాయణ స్వగ్రామానికి కూడా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఇలాటి విషాదం కారణంగా ఢిల్లీ టూర్ రద్దయింది.
ఈ టూర్ రద్దును కూడా పచ్చదళం నీచరాజకీయానికి వాడుకుంటోంది. శవరాజకీయాలు చేయడం.. ఎదుటివారిమీద బురద చల్లడం తెలుగుదేశానికి అలవాటే. అయితే.. చచ్చిపోయిన ఆప్తుడిని పరామర్శించడానికి వెళుతున్న మానవీయ కోణాన్ని కూడా.. తెలుగుదేశం రాజకీయానికి వాడుకోవాలని చూడడం మాత్రం హేయం.
అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అందుకే జగన్ తిరిగి వచ్చారని తెదేపా నేతలు అంటున్నారు. నిత్యం దోచుకోవడం మాత్రమే తెలిసిన నాయకులు.. మానవీయ బంధాల విలువ ఎలా తెలుస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.