అత్తమీద కోపం దుత్త మీద చూపిన చందంగా… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య విభేదాల ఎఫెక్ట్ అమరావతి రైతులపై పడింది. అమరావతి రైతుల మహాపాదయాత్రపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎఫెక్ట్ బలంగా పడింది.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కాలి నడకన వెళుతున్న సంగతి తెలిసింది. గత నెల రోజులుగా వారికి ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది.
నెల్లూరుకు వచ్చిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వారిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమరావతి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంఘీభావం తెలిపారంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన నియోజకవర్గ పరిధిలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండగా, అక్కడే ఉన్న అమరావతి రైతులను కూడా తాను కలుసుకున్నట్టు ఆయన చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తేవాలని సూచించినట్టు కోటంరెడ్డి వివరించారు.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించడం తప్పా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఇదే అమరావతి రైతుల పాలిట సర్వేపల్లి నియోజకవర్గంలో కష్టాలు తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు తీవ్రస్థాయిలో ఉంది. కోటంరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. గతంలో వాళ్లిద్దరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
ఈ నేపథ్యంలో అమరావతి రైతులను కలిసిన కోటంరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద చెడ్డ చేసేందుకు ఇదే సరైన సమయ మని కాకాణి భావించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో తన నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నఅమరావతి రైతులకు గత నెల రోజులుగా లేని ఇబ్బందులను అధికార పార్టీ సృష్టించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురు కావడం వెనుక కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎఫెక్టే అని నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో బసకు, వంటకు స్థలాలు దక్కని పరిస్థితి ఉత్పన్నమైందనే కాకాణి ఏ స్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరికి అమరావతి రైతులు రోడ్డుపైనే మధ్యాహ్న భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే… వైసీపీలో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరిందనే సంకేతాలు వెల్లడైనట్టు చెబుతు న్నారు.
అంతే తప్ప, అమరావతి రైతులపై కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ప్రత్యేకమైన ఆగ్రహం ఏముంటుందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తుండడం గమనార్హం. అమరావతి రైతులను కోటంరెడ్డి కలవకుండా ఉంటే … ఈ వింత పరిస్థితి ఎదురయ్యేది కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమరావతి రైతులను కోటంరెడ్డి కలవడం వెనుక భవిష్యత్ వ్యూహం దాగి ఉందని, అది ఏంటనేది రానున్న కాలంలో తెలుస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.