ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో సీఎం జగన్ వరుస భేటీలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మైలవరంలో అసలేం జరుగుతోందని వైసీపీలో గుసగుసలాడుతున్నారు. సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు ఇవాళ సాయంత్రం వసంత కృష్ణప్రసాద్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లడం గమనార్హం. మంత్రి జోగి రమేశ్, వసంత కృష్ణప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
మైలవరంలో మంత్రి జోగి రమేశ్ జోక్యం చేసుకుంటూ, తనకు విలువ లేకుండా చేస్తున్నారనేది వసంత కృష్ణప్రసాద్ ప్రధాన ఆరోపణ. వసంత కృష్ణప్రసాద్‌కు కనీస సమాచారం లేకుండానే మైలవరంలో తనకు కావాల్సిన డీఎస్పీని మంత్రి జోగి రమేశ్ నియమించుకున్నారు. దీనిపై కృష్ణప్రసాద్ మండిపడుతున్నారు. మైలవరం నుంచి మంత్రి జోగి రమేశ్ పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్నారు. ఆ నియోజకవర్గం పరిధిలోనే ఇల్లు కూడా కట్టుకున్నారు.
కృష్ణప్రసాద్‌పై మంత్రి అనుచరులు నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసులు కూడా నమోదు చేయిస్తున్నారని సమాచారం. దీంతో అధికార పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేను చూసినట్టుగా తనను ట్రీట్ చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికే ఓ పథకం ప్రకారం టార్గెట్ చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద వసంత వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి కూడా వసంత కృష్ణప్రసాద్ వెళ్లలేదని సమాచారం. అయితే దీనికి ఆయన వేర్వేరు కారణాలు చెబుతున్నారు. మంత్రి జోగి రమేశ్‌తో సీఎం జగన్ బుధవారం మైలవరం వివాదంపై చర్చించారు. ఆ మరుసటి రోజే వసంత కృష్ణప్రసాద్‌ను సీఎం పిలిపించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మైలవరం టికెట్‌పై వసంతకు సీఎం జగన్ ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది. జగన్ నిర్ణయం తనకు అనుకూలంగా వుంటే వసంత వైసీపీలోనే వుంటారు. లేదంటే తన దారేదో ఆయన చూసుకుంటారని అభిమానులు చెబుతున్నారు. వసంత కీలక నిర్ణయం తీసుకోడానికి ఇవాళ్టి సీఎంతో భేటీ కారణం కానుంది.