తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అసలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కాంగ్రెస్ అసంతృప్తి, రేవంత్‌రెడ్డి వ్యతిరేక గ్రూప్‌నకు చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ కావడం పలు రకాల ప్రచారానికి తెరతీసింది. సంగారెడ్డిలో జగ్గారెడ్డికి మంచి పట్టు వుంది. ఈ దఫా ప్రతి సీటును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్‌గా అవతరించడం, మరోవైపు బీజేపీ దూసుకొస్తుండడంతో ప్రతిపక్షాల్లో బలమైన నాయకులను తన వైపు తిప్పుకోడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ హాల్లో సీఎంని జగ్గారెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. వీళ్లద్దరి భేటీపై మీడియాలో వైరల్ అయ్యింది. జగ్గారెడ్డిపై అనుమానాలు కలిగించేలా చర్చ జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని ఇదే జగ్గారెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
దీంతో కాంగ్రెస్‌లో కొనసాగి రాజకీయ జీవితాన్ని బలి పెట్టడం కంటే, బీఆర్ఎస్ లేదా బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరడం మంచిదనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారంటే, దాని వెనుక ఏదో కథ నడిచే వుంటుందనే చర్చ నడుస్తోంది. ఊరికే కేసీఆర్ పిలిచి మాట్లాడరని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడిగిన పనులు చేయరని అంటున్నారు.
మరోవైపు కేసీఆర్‌తో భేటీపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం కావడంపై జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం చర్చించేందుకే కేసీఆర్‌తో కలిసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. సంగారెడ్డి వరకూ మెట్రోరైలు, తన నియోజక వర్గంలో 500 మందికి దళిత బంధు, అలాగే 5 వేల మందికి ఇంటి స్థలాలు, తదితర అంశాలపై సీఎంకు వినతిపత్రం సమర్పించినట్టు జగ్గారెడ్డి వివరించారు.