నారా లోకేశ్ పాదయాత్రలో ఒకదాని వెంట మరొకటి విషాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. పాదయాత్ర మొదటి రోజే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన మృత్యువుతో అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. ఈ విషాదాన్ని మరిచిపోకనే పాదయాత్రలో లోకేశ్‌కు భద్రత కల్పించేందుకు వచ్చిన కానిస్టేబుల్ గుండెపోటుకు గురికావడం గమనార్హం.
ప్రస్తుతం గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. లోకేశ్ బందోబస్తు విధులకు కానిస్టేబుల్ రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదిలా వుండగా చంద్రబాబు, లోకేశ్ పర్యటనల్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో చంద్రబాబు పర్యటనల్లో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అందుకే జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. దీనిపై హైకోర్టు తీర్పు వెలువరించాల్సి వుంది.
తాజాగా లోకేశ్ పాదయాత్ర రెండు వారాలకు చేరుకునే సరికి ఇద్దరు గుండెపోటుకు గురి కావడంతో ప్రత్యర్థులు తండ్రీకొడుకుల పాదాలపై సెటైర్స్ విసురుతున్నారు. తండ్రీకొడుకులు ఎక్కడ అడుగు పెట్టినా ఎవరో ఒకరివి ప్రాణాలు పోవాల్సిందేనా అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.