రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ వేడి మరింత రగలనుంది. ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయో తెలుసుకుందాం.
ఏపీలో 8, అలాగే తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23న చివరి రోజుగా నిర్ణయించారు. మార్చి 13న పోలింగ్ జరగనుంది. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు గడపగడపకూ వెళుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరింత స్పీడ్ పెంచనున్నారు.