తండ్రి డెత్ బెడ్ పై ఉన్నాడు. ఎప్పుడు మరణిస్తాడో చెప్పలేమని వైద్యులు కూడా చెప్పేశారు. అతడి ఆఖరి కోరిక కొడుకు పెళ్లి చూడడం. దీంతో ఆ కొడుకు, హాస్పిటల్ లో తండ్రి బెడ్ ఎదురుగా పెళ్లి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన.
మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని ముల్తాయ్ లో ఈ ఘటన జరిగింది. ప్రభాత్ పట్టాన్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల మోయిత్ ఉల్లాఖాన్ బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నాడు. అప్పటికే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో హుటాహుటిన నాగపూర్ నుంచి ముల్తాయ్ లోని క్రిష్ మెమొరియల్ హాస్పిటల్ కు తరలించారు.
వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ మోయిత్ శరీరం సహకరించలేదు. ఇక మరికొన్ని రోజులు మాత్రమేనని వైద్యులు తేల్చేశారు. అలా జీవిత చరమాంకంలో ఉన్న మోయిత్, తన కొడుకు పెళ్లి చూసి చనిపోవాలనే కోరికను వ్యక్తం చేశాడు.
దీంతో కొడుకు ఆయుబ్ ఖాన్ ఉన్నఫలంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే తెలిసిన వాళ్ల అమ్మాయి ఉండడంతో, హాస్పిటల్ లోనే తండ్రి బెడ్ ముందు, ఓ మౌల్వీ సమక్షంలో ఆమెను నిఖా చేసుకున్నాడు. ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న మోయిత్, కొడుకు పెళ్లిని కళ్లారా చూశాడు. ఆస్పత్రి సిబ్బంది నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే 2 నెలల కిందట బిహార్ లో జరిగింది. అమ్మ చివరి కోరిక తీర్చేందుకు, ఐసీయూలో ఆమె ఎదురుగా పెళ్లి చేసుకుంది కూతురు. ఆ పెళ్లిని కళ్లారా చూసిన ఆ తల్లి, కొన్ని గంటలకే మృతి చెందింది.