జగన్ సర్కార్, ఉద్యోగుల మధ్య వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఉద్యోగుల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీ సర్కార్‌తో ఉద్యోగులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు… సంబంధిత సంఘాల నాయకుల హెచ్చరికలు చెబుతున్నాయి. రెండో దశ ఉద్యమంలోకి వెళ్లేలోపే ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఉద్యోగుల పోరాటాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగల సంఘాల నేతలు తీవ్రంగా హెచ్చరించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణను తెలియజేసే ఐదు పేజీల లేఖను నోటీసు రూపంలో సీఎస్ సమీర్‌శర్మకు ఉద్యోగ సంఘాల నాయకులు బుధవారం ఇచ్చారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక వైఖరిని తప్పు పట్టారు. ప్రభుత్వమే తమ ఉద్యమానికి బాధ్యత వహించాలని వారు తేల్చి చెప్పారు.
పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఏపీ జేఏసీ నేతలు గుర్తు చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణిని నిరసిస్తూ ప్రకటించిన విధంగా ఉద్యమ కార్యాచరణను తప్పకుండా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ సమీర్‌శర్మ హామీ ఇచ్చారన్నారు. హామీల అమలు ప్రభుత్వం చేతుల్లోనే ఉందన్నారు.
కరోనా సమయంలో 4..5వేల మంది ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవరికీ లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
పీఆర్సీ నివేదికలో చెప్పకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు ఉద్యోగులను కించపరిచేలా ఉన్నాయన్నారు. పీఆర్సీ అమలుపై ఉద్యోగులతో ఆర్థిక మంత్రి చర్చలు జరపడం సంప్రదాయమని గుర్తు చేశారు. బుగ్గన ఒక్క రోజైనా ఉద్యోగులతో మాట్లాడారా? ఆయన ప్రశ్నించారు. అసలు బుగ్గన అందుబాటులో ఉన్నదెప్పుడు అని ప్రశ్నించారు.
7వ తేదీ నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారని, 10వ తేదీ మధ్యాహ్నం భోజన విరామంలో నిరసనలు చేస్తామన్నారు. 13న తాలూకా, డివిజన్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. 27 నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ ఉద్యమం కంటే ఉద్యోగుల హెచ్చరికలతో వైసీపీ నేతల్లో వణుకు పుడుతోంది.