ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద మనసుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం ఫిదా అయ్యింది. ఊపిరితిత్తుల క్యాన్సర్తో సిరివెన్నెల తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆస్పత్రిలో సిరివెన్నెల వైద్య ఖర్చులన్నీ ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం తాజాగా వెలుగు చూసింది.
ఈ మేరకు తమ కుటుంబంపై ప్రేమానురాగాలు కనబరిచిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ… సిరివెన్నెల కుమారుడు సాయియోగేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఏమున్నదో తెలుసుకుందాం
సిరివెన్నెల చికిత్స నిమిత్తం కిమ్స్ హాస్పిటల్లో అయిన ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వం భరించి, ఆపత్కాల సమయంలో అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సిరివెన్నెల కుటుంబ సభ్యుల పక్షాన ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు.
గత నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న తమకు శాస్త్రిగారి ఆరోగ్య పరిస్థితులపై విచారిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్టు సిరివెన్నెల కుమారుడు సాయియోగేశ్వర్తో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేరుతో విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్పత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ చెప్పినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తమకు తెలిపారని వెల్లడించారు.
అదే రోజు సాయంత్రం 4.07 గంటలకు శాస్త్రి గారు మరణించినట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారని, అలాగే అంత్యక్రియలకు ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నానిని పంపినట్టు వారు పేర్కొన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో సిరివెన్నెల వైద్య ఖర్చులన్నీ భరించడంతో పాటు తాము కట్టిన అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయిన విషయాన్ని తమకు మంత్రి పేర్ని నాని చెప్పారని కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సిరివెన్నెల గారి విషయంలో ఇంత ప్రేమానురాగాలు చూపించి, తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మరోసారి సాయియోగేశ్వర్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆ ప్రకటనలో వినమ్రంగా పేర్కొనడం గమనార్హం.
చిత్రపరిశ్రమకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ అండగా నిలబడడం అంటే ఏంటో చేతల్లో చూపారు. తెలుగు సమాజమే కాదు, యావత్ దేశమంతా గర్వపడే గేయ రచయిత వైద్య ఖర్చులు భరించి, ఆయన కుటుంబానికి అండగా ఉంటానని చేతల్లో చూపడంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.