ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది? ఈ ప్రశ్నకు ప్రతి ఏటా సమాధానం ఇస్తోంది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అనే సంస్థ. ఈ ఏడాది కూడా ఈ సంస్థ ఓ జాబితా రిలీజ్ చేసింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో ఈసారి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ నగరం మొదటి స్థానానికి చేరింది.
దేశంలోని వివిధ నగరాల్లో వ్యక్తుల జీవన ప్రమాణాలు, రోజువారీ ఖర్చులు, నిత్యావసరాల ధరలు, అద్దెలు లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఈ జాబితా తయారుచేసింది ఈఐయూ సంస్థ. అమెరిన్ డాలర్ ను ప్రామాణికంగా తీసుకొని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ను అంచనా వేసింది.
ఈ సంస్థ నివేదిక ప్రకారం, స్థానిక కరెన్సీ పరంగా సంవత్సరానికి వస్తువులు మరియు సేవల ధరలు 3.5 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల అత్యథికంగా టెల్ అవీల్ లోనే ఉంది. మరీ ముఖ్యంగా రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా ప్రజల కొనుగోలు శక్తి, వాణిజ్యంపై ప్రభావం చూపింది. ఈ అంశాల్ని కూడా లెక్కలోకి తీసుకొని జాబితా విడుదల చేశారు.
గడిచిన ఏడాదిగా అత్యథికంగా ధరలు పెరిగిన నగరం ఇరాన్ లోని టెహ్రాన్. అమెరికా ఆంక్షల వల్ల టెహ్రాన్ లో ధరలు ఆకాశాన్నంటాయి. ఇక సిరియన్ సిటీ డమాస్కస్ అత్యంత చౌకైన నగరంగా పేరుతెచ్చుకుంది. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో డమాస్కస్ కు ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడాది టాప్-10 లిస్ట్ లో ఇండియా నుంచి ఏ ఒక్క నగరానికి చోటు దక్కలేదు. జాబితాలో అత్యంత ఖరీదైన నగరాల్లో రెండో స్థానంలో పారిస్ సింగపూర్ సంయుక్తంగా నిలిచాయి. మూడో స్థానంలో జూరిచ్ (స్విట్జర్లాండ్), నాలుగో స్థానంలో హాంకాంగ్, ఐదో స్థానంలో న్యూయార్క్ నగరాలు నిలిచాయి.