తెలుగుపాటకి ఆస్కార్ గుర్తింపు దక్కింది. కీరవాణికి, చంద్రబోస్ కి ఆస్కార్ కమిటీ ఆహ్వానాలందాయి. తెలుగువాళ్లగా మనమందరం ఆనందంతో రొమ్ము విరచాల్సిన సందర్భమిది. కానీ ఎంతమందికి ఆ ఆనందం సంపూర్ణంగా కలుగుతోంది?
కీరవాణి “నాటు నాటు” కంటే గొప్ప పాటలెన్నో స్వరపరిచారు. చంద్రబోస్ ఈ పాటకంటే కొన్ని వందల గొప్ప పాటలు రాసారు. నిజానికి “మౌనంగానే ఎదగమని” లాంటి ఎన్నో యూనివర్సల్ వ్యక్తిత్వవికాస గీతలు రాసిన గొప్ప కవి చంద్రబోస్. ఆయనకు ఆస్కార్ గౌరవం దక్కడం అందరికీ సంతోషమే కానీ అది “నాటు నాటు” పాటకి కావడం మాత్రం ఒకింత పెదవి విరచాల్సిన విషయమే. ఈ గౌరవం లభించడం తమకు ఆనందమే ఆయినా బహుశా ఈ పాటకి గాను ఇంత గౌరవాన్ని పొందడం కీరవాణి, చంద్రబోసులిద్దరికీ కూడా పూర్తి సంతృప్తినివ్వకపోవచ్చు.
ఈ పాట వినిపిస్తేనే ఆస్కార్ వారు “బెస్ట్ ఒరిజినల్ సాంగ్” గా నామినేట్ చేసారంటే ఇన్నాళ్లూ తెలుగు సినిమాల్లో వచ్చిన అద్భుతమైన సాహిత్యం వింటే ఏమైపోతారో అని మనలో చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఆస్కార్ నామినేటయ్యినా, రేపు అవార్డే వచ్చినా అది సంగీతసాహిత్యాలతో కూడిన విషయానికి వచ్చింది కాదు, హడావిడితో కూడిన వ్యవహారానికి వచ్చిందని తెలుసుకోవాలి.
నిజానికి రాజమౌళి సారధ్యంలో ఏకంగా రూ 50 కోట్ల ఖర్చు పెట్టి ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా ఒకటుందని అమెరికాలోని పత్రికల్లో ఊదరగొట్టారు. జపాన్ లాంటి దేశాల్లో సినిమాని ఆడించి ఆ వార్తల్ని అమెరికా పత్రికల్లో రాయించారు. అమెరికన్ ఫిల్మ్ క్రిటిక్స్ కి షో వేసి వారిలో ఉన్న ఇంఫ్లుయన్సర్స్ ని ప్రభావితం చేసారు. ఇవన్నీ చేయడానికి మునుపు ఈ పాటకి విదేశీ యూట్యూబర్ల చేత కవర్ డ్యాన్సులు చేయించి తెలుగు పాటకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. మొత్తానికి ముందుగా గోల్డెన్ గ్లోబ్ లో సత్తాచాటి పాటకి అవార్డు గెలిచారు. రాజమౌళి ఇంత వ్యవహారం నడిపిస్తే చచ్చినట్టు “నాటు నాటు” ని గుర్తించారు ఆస్కార్ వారు.
నిజానికి కొరియన్ మూవీ “పేరసైట్” కి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ దక్కినట్టు ఈ “ఆర్ ఆర్ ఆర్” కి కూడా ఆశించి ఉండొచ్చు. దానికంటే ఎక్కువగా సొంత డబ్బుతో చేసుకున్న ప్రయత్నం కనుక తనకే ఉత్తమదర్శకుడిగా అవార్డు కోసం జపించి ఉండొచ్చు రాజమౌళి. లేదా తన అన్నయ్య కీరవాణికి ఉత్తమసంగీత దర్శకుడి అవార్డు కోసం తపించి ఉండొచ్చు. ఇవన్నీ కాకపోయినా చిత్ర కథానాయకుడు ఎన్.టి.ఆర్ ఉత్తమనటుడు అవార్డు కోసమైనా ఆశపడి ఉండొచ్చు. అతన్ని అంతలా లేపి తనది నిజంగా ఆస్కార్ స్థాయి నాటనేనేమో అనుకునేంత భ్రమలోకి నెట్టారు అతనిని. లేకపోతే అంతలా కష్టపడి అమెరికన్ ఏక్సెంటులో ఇంటర్వ్యూలివ్వడం వగైరాలు అవసరం లేదు. ఫైనల్ గా ఇవన్నీ తప్పిపోయి “ఉత్తమ గీతం” గా నాటునాటుకి నామినేషన్ దక్కింది. కొంతలోకొంత నయమేంటంటే ఈ అవార్డులో సగభాగం రాజమౌళి కుటుంబ సభ్యుడు కీరవాణిదే. రెండో సగం చంద్రబోసుది. నిజానికి ఈ పాటకి ఇంత గుర్తింపొస్తుందని ముందే తెలిసుంటే లిరిక్స్ కూడా కీరవాణే రాసుకునే వారేమో. అన్ని కోట్లు ఖర్చు పెట్టి అప్పళంగా చంద్రబోసుకి కూడా అవార్డులో భాగస్వామ్యం ఇవ్వాల్సి వచ్చినందుకు రాజమౌళి కుటుంబం నిరాశపడి ఉండొచ్చు….అది మానవసహజం.
ఈ మొత్తం ప్రక్రియలో లక్కీ మ్యాన్ ఎవరంటే చంద్రబోసే. ఎవరో చేసిన ప్రయత్నానికి తనకి పురస్కారమొచ్చింది.
మార్చిలో జరిగే ఆస్కార్ వేడుకలో కీరవాణి పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అది చాలా గొప్ప విషయం. చంద్రబోసుకి కూడా ఆస్కార్ కామిటీ పిలుపొచ్చింది. ఈ పిలుపుని బట్టి “ఉత్తమ గీతం” గా నాటు నాటు కి అవార్డు రావడానికి చాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పిలుపే అవార్డిస్తున్నామనడానికి ఆస్కార్ వారి సంకేతంగా భావించవచ్చు. రావాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం. పెదవివిరుపులు మనసులోనే పెట్టుకుందాం.
ఇక ఇంత చేసినందుకు తెలుగువారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సింది రాజమౌళికే. ఎక్కడ ఆస్కార్ అవార్డు..ఎక్కడ ఒక సాదా సీదా నాటు పాట! ఈ పాట ఇంత పాపులర్ అయ్యిందంటే ముఖ్యకారణం కోరియోగ్రఫీ. ఆ విభాగంలో అవార్డొచ్చినా తెలుగువారు పూర్తి సంతృప్తిగా ఉండేవారు.
ఆస్కార్ అవార్డు రావడానికి విషయం కాదు..వ్యవహారం ఒక్కటే అవసరమని రాజమౌళి నిరూపించారు. ఆయన వేసిన బాటలో రూ50 కోట్లు ఖర్చు పెట్టుకోగల ప్రతి భారతీయ సినిమా దర్శకుడు ప్రయత్నిస్తాడు. రేపు పుష్ప2 కి అల్లు అర్జున్ కచ్చితంగా సుకుమార్ చేత ఆస్కార్ పబ్లిసిటీ ప్లాన్ రాయిస్తాడు.
సరదాగా చెప్పుకుంటే … ఇదంతా చూసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాటలన్నీ తానే రాసేసుకుంటాడేమో..పొరపాటున ఆస్కారొస్తే అనవసరంగా గీతరచయితతో పంచుకోవడమెందుకని! అలాగే కోరియోగ్రఫీ కూడా సుకుమారే చేసుకుంటాడేమో …ఆ విభాగంలో అవార్డొచ్చినా తానే తీసుకోవచ్చని!
శ్రీనివాసమూర్తి