యువగళం పేరుతో కుప్పం నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర…రెండు వారాలొచ్చే సరికి లోకేశ్‌కు భారంగా మారింది. మొదట్లో ఉన్న ఉత్సాహం నెమ్మదిగా నీరుగారిపోతోంది. తన పాదయాత్రకు జనం నుంచి విపరీతమైన స్పందన వస్తుందని లోకేశ్ ఆశించారు. వైఎస్ జగన్ పాదయాత్రకు వచ్చిన జనం కంటే రెట్టింపు స్థాయిలో తన వద్దకు వస్తారని లోకేశ్ ఏవేవో పగటి కలలు కన్నారు. తీరా రోడ్డు మీదకు వస్తే తప్ప, తనపై జనాభిప్రాయం ఏంటనే వాస్తవం తెలిసొచ్చింది.
పేరులోనే యువగళం తప్ప, యువతలో ఉండాల్సిన ఉత్సాహం, పట్టుదల లోకేశ్‌లో మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి నష్టమే తప్ప, ఏ మాత్రం లాభం లేదనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది. లోకేశ్ పాదయాత్ర టీడీపీకి భారంగా మారింది. దీన్ని దింపుకునేందుకు ఏం చేయాలనే అంతర్మథనం టీడీపీలో సీరియస్‌గా సాగుతోంది. పాదయాత్ర గండం నుంచి టీడీపీని, లోకేశ్‌ను బయటపడేసే శక్తి కేవలం సీఎం జగన్మోహన్రెడ్డి చేతిలోనే వుందని ఆ పార్టీ వ్యూహ కమిటీ ఆలోచన.
ఈ క్రమంలో టీడీపీ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పకుండా వస్తాయనే ప్రచారానికి టీడీపీ వ్యూహ కమిటీ తెరతీసింది. రెండేళ్ల నుంచి ఇదే విధమైన ప్రచారం చేస్తూ… కేడర్‌ను కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిం చారు. తాజాగా ఎన్నికలకు గట్టిగా మరో ఏడాది మాత్రమే గడువు వుంది. ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టడం వెనుక వ్యూహం అందరికీ తెలిసిందే.
లోకేశ్ పాదయాత్ర భారంగా ముందుకు సాగుతోంది. ఎందుకు మొదలు పెట్టాడురా దేవుడా అని టీడీపీ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్న సంగతి గురించి తెలిసిందే. దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని చేయడం ద్వారా, లోకేశ్ పాదయాత్ర నిర్దేశిత సమయం కంటే ముందే ముగిస్తామనే సంకేతాలు ఇచ్చేందుకే అని చెబుతున్నారు.