బీజేపీకి వ్య‌తిరేకంగా… అదానీపై స‌త్య‌కుమార్‌!

బీజేపీ సీనియ‌ర్ నేత స‌త్య‌కుమార్ ఎందుక‌నో పార్టీలో ఉక్క‌పోత ఫీలింగ్‌లో ఉన్నారు. గాడ్‌ఫాద‌ర్‌ను బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పించింది. దీంతో స‌త్య‌కుమార్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. మ‌రోవైపు తానెంత‌గానో ఆరాధించే…

బీజేపీ సీనియ‌ర్ నేత స‌త్య‌కుమార్ ఎందుక‌నో పార్టీలో ఉక్క‌పోత ఫీలింగ్‌లో ఉన్నారు. గాడ్‌ఫాద‌ర్‌ను బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పించింది. దీంతో స‌త్య‌కుమార్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. మ‌రోవైపు తానెంత‌గానో ఆరాధించే చంద్ర‌బాబుకు ప‌రోక్షంగా సాయం అందించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో స‌త్యకుమార్‌కు దిక్కుతోచ‌డం లేదనే టాక్ వినిపిస్తోంది.

దీంతో బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని స‌త్య‌కుమార్ ఆద‌ర్శంగా తీసుకున్నార‌ని సొంత పార్టీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ్యాపార దిగ్గ‌జం గౌత‌మ్ అదానీ విష‌య‌మై పార్ల‌మెంట్ ద‌ద్ద‌రిల్లుతున్న సంగ‌తి తెలిసిందే. అదానీతో మోదీ అనుబంధంపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వీటికి క‌నీసం స‌మాధానం ఇచ్చుకోలేని దుస్థితిలో ప్ర‌ధాని మోదీ ఉన్నారు.

ఇదే సంద‌ర్భంలో అదాని ఆస్తుల‌పై బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి అదానీ అత్యంత ఆప్తుడ‌నే సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే అదానీపై స్వామి వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇదే రీతిలో స‌త్య‌కుమార్ కూడా అదానీపై కామెంట్స్ చేయ‌డం ద్వారా…. బీజేపీపై త‌న అసంతృప్తిని ప‌రోక్షంగా వెల్ల‌డించార‌ని ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది.

జ‌గ‌న్ కేబినెట్ బుధ‌వారం స‌మావేశ‌మై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు 500 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు 406.46 ఎకరాలు, అలాగే… ఈ ప్రాజెక్టు కోసం కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 362 ఎకరాలు, ఇదే జిల్లాలో మరో 318 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం మరో 60.29 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ప్ర‌భుత్వం ప్రకటించింది.

దీన్ని బీజేపీ సీనియ‌ర్ నేత స‌త్య‌కుమార్ త‌ప్పు ప‌ట్టారు. విశాఖ‌లో అద‌నంగా 100 మెగావాట్ల డేటా సెంట‌ర్‌ను అదానీకి అప్ప‌గించ‌డం వెనుక తాడేప‌ల్లి ఆంత‌ర్య‌మేమిట‌ని స‌త్య‌కుమార్ ప్ర‌శ్నింగ‌డం గ‌మ‌నార్హం. అదానీకి భూములివ్వ‌డాన్ని ప్ర‌శ్నించ‌డం అంటే… ప‌రోక్షంగా ప్ర‌ధాని మోదీని నిల‌దీయ‌డ‌మే అని ఆయ‌న పార్టీకి చెందిన నేత‌లే అంటున్నారు. అదానీకి భూములు ఇవ్వ‌డాన్ని క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌లు కూడా ప్ర‌శ్నించ‌డం లేద‌ని, స‌త్య‌కుమార్ ఆ ప‌ని చేయ‌డం వెనుక ఉద్దేశం గురించి లోతుగా ఆలోచించాల్సిందే అని బీజేపీ నేత‌లు అంటున్నారు. స‌త్య‌కుమార్ అంటే ఢిల్లీలో బీజేపీ, ఏపీలో టీడీపీ అంటే ఇదే కాబోలు అని ఆ పార్టీ నేత‌లు స‌ర‌దాగా విమ‌ర్శిస్తున్నారు.