వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలో నడుస్తున్నారు తాజా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రోజు ఏదో ఒక్కటి టీడీపీ మీడియాలో వచ్చే వార్తల సందేశాన్ని వినిపిస్తూ సామాజిక మీడియాకు కావాల్సిన విందును అందిస్తున్న ఎంపీ రఘరామ కృష్ణం రాజు లాగా కోటం రెడ్డి కూడా రోజుకొక ప్రెస్ మీట్ పెడుతూ తనదైన శైలిలో వైసీపీపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాకపోతే ఎంపీ రఘరామ కృష్ణం రాజు లాగా సీఎం జగన్ ను ఎక్కడ వ్యక్తిగతంగా తిట్టకుండా మిగత వైసీపీ నాయకులపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇవాళ మీడియా సమావేశంలో కోటంరెడ్డి.. వైసీపీ నెల్లూరు రూరల్ ఇంచార్జ్, ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు. గతంలో మాదిరిగా అన్ని పార్టీలకు తిరగొద్దని.. నేను మళ్లీ వైసీపీ పార్టీ నుండి పోటీ చేయను అంటునే.. వచ్చే ఎన్నికల నాటికి అదాల ఏ పార్టీలో ఉంటున్నారో సృష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ బి ఫామ్ తీసుకోని వైసీపీకి వెళ్లినట్లు ఈ సారి ఆలా చేయకండి అంటూ హితవు పలికారు.
ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరితే.. ఫోన్ మాట్లాడిన వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నరని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటే ప్రభుత్వమే విచారణ కోరవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. రాష్ట్రంలో నాయకులు ఫోన్లో మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శించారు. అలాగే కష్టాల్లో, నష్టాల్లో నాతో పాటు 11 మంది కార్పోరేటర్లు నడుస్తున్నారని వారితో మీడియా సమావేశంలో మాట్లాడించారు.
మొత్తానికి కోటంరెడ్డి కూడా రెబల్ ఎంపీ బాటలో నడుస్తూ టీడీపీ ఆఫీస్ నుండి వచ్చే వార్తలను చదువుతు సామాజిక మీడియాకు పసందైన విందు అందించబోతున్నారు.