ఇండస్ట్రీ అడ్వాన్సుల మీద నడుస్తుంది.. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా ఇదే నిజం. ఒక హిట్ కొట్టిన హీరోకి అలాగే ఆ దర్శకుడికి ముందుగా బడా సంస్థల నుండి అడ్వాన్సులు ఇంటికెళ్ళిపోతాయి. వచ్చిన లక్ష్మీ దేవిను కాదనడం ఎందుకనీ కథలు లేకపోయినా నిర్మాతల నుండి డబ్బు తీసుకొని బ్యాంకులో వేసుకుంటారు దర్శకులు. అయితే ఇలా తీసుకున్న అడ్వాన్సులే మెడకు చుట్టుకునే సందర్భాలు కోకొల్లలున్నాయి.
ప్రస్తుతం చాలా నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్సులు తీసుకున్న దర్శకుడిగా టాప్ లో నిలిచాడు పరశురామ్. ఇండస్ట్రీలో పరశురామ్ పక్కా కమర్షియల్ డైరెక్టర్ అనే టాక్ ఉంది. క్రియేటివ్ కంటెంట్ కంటే కమర్షియల్ డిస్కషన్ లోనే పరశురామ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడనేది ఇన్ సైడ్ టాక్. గీతగోవిందం తో 100 కోట్ల క్లబ్ దర్శకుల జాబితాలోకి వెళ్లాడు పరశురామ్. అసలే కమర్షియల్ బ్రెయిన్. దానికి తోడు గట్టి సక్సెస్ వచ్చింది. ఇంకేముందు అందినకాడికి అడ్వాన్సులు అందుకున్నాడు.
అందులో గీత ఆర్ట్స్ కూడా ఉంది. గీతగోవిందం తర్వాత కూడా పరశురామ్ అల్లు అరవింద్ కే సినిమా చేయాల్సి ఉంది. కానీ 14 రీల్స్ లో తీసుకున్న అడ్వాన్సు గుర్తొచ్చి ఆ బ్యానర్ కి ఓ సినిమా చేసి వచ్చేస్తానని గీత కాంపౌండ్ నుండి బయటికొచ్చాడు పరశురామ్. ఆ తర్వాత నాగచైతన్య-14 రీల్స్ సినిమాను పక్కన పెట్టేసి మైత్రీ అడ్వాన్సును క్లియర్ చేయాలని మహేష్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. మహేష్ పిలవగానే చైతు సినిమా వదిలేయడంతో 14 రీల్స్ నిర్మాత నుండి పరశురామ్ కి ఇబ్బంది వచ్చింది. దాంతో వాళ్ళను కూడా సర్కారు వారి పాట లో భాగస్వామ్యం చేయాల్సి వచ్చింది.
చైతన్యతో 14 రీల్స్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వట్లేదు. దీంతో 14 రీల్స్, గీతా ఆర్ట్స్ ను పక్కన పెట్టేసి దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ తో సినిమాను సెట్ చేసుకున్నాడు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. తమ అడ్వాన్స్ ఉండగానే పరశురామ్ తమకి ఏ విషయం చెప్పకుండా దిల్ రాజు తో సినిమా ఎనౌన్స్ చేయడం అరవింద్ కు ఆగ్రహం తెప్పించింది. ఓ ప్రెస్ మీట్ పెట్టేసి దర్శకుడి బాగోతం అంతా జనాల ముందు పెట్టేద్దామని డిసైడ్ అయ్యారు అరవింద్. అనుకున్నారో లేదా స్కెచ్ వేసి భయపెట్టే ప్రయత్నం చేశారో తెలియదు కానీ ఫైనల్ గా పరశురామ్ తన సతీమణితో అల్లు కాంపౌండ్ లోకి వెళ్ళి సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. లోలోపల మేటర్ సెటిలైంది.
ఈ మొత్తం ఎపిసోడ్ తో భారీగా అడ్వాన్సులు అందుకున్న దర్శకులకు చిన్నగా భయం మొదలైంది. నిజానికి ఈ విషయంలో దర్శకులను కూడా పూర్తిగా తప్పు పట్టలేం. ఇచ్చేవాడు ఉన్నప్పుడు పుచ్చుకోవడానికేంటి ఇబ్బంది అన్నట్టుగా దర్శకుల వైఖరి ఉంది. మైత్రి సంస్థ హిట్ కొట్టిన ప్రతీ దర్శకుడికి అడ్వాన్సు ఇచ్చేసి లైన్లో పెట్టేసుకుంది. ఎన్టీఆర్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సుధాకర్ మిక్కిలినేని అనే నిర్మాతైతే దాదాపు అరడజను మంది దర్శకులకు ఇప్పటికే అడ్వాన్సులిచ్చి ఉన్నారు. కేఎస్ రామారావు, బెల్లంకొండ, సాహు గారపాటి, అనీల్ సుంకర లాంటి నిర్మాతల సంగతి సరేసరి.
ఇలా ఓవైపు నిర్మాతలు ఎగబడి అడ్వాన్సులు ఇస్తుంటే, ఎంత మంది దర్శకులు చేతులుముడుచుకొని కూర్చుంటారు. కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇలాంటి అడ్వాన్సుల వ్యవహారానికి దూరంగా ఉన్నారు, మిగతా వాళ్లంతా పుచ్చుకున్నోళ్లే. అయితే అలా పుచ్చుకున్న దర్శకులంతా, ఆర్డర్ పాటించడం చాలా ముఖ్యమనే విషయాన్ని 'పరశురామ్ ఎపిసోడ్' చాటిచెప్పింది. అడ్వాన్సులు తీసుకోవడం తప్పు కాదు, దాన్ని నెరవేర్చేలా చకచకా సినిమాలు చేయడం, ఆర్డర్ పాటించడం అతి ముఖ్యం.