తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారుల విన్నపం. దయచేసి మూడు రోజుల పాటు తిరుమలకు రావడాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని వేడుకుంటున్నారు. ఇదంతా భక్తుల క్షేమాన్ని కోరుతూ చేస్తున్న విజ్ఞప్తి.
తిరుమల మొదటి, రెండో ఘాట్ రోడ్డులలో కొండ చరియలు భారీగా విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఆ మార్గాన వెళ్లే వాహనాలకు ప్రమాదం తప్పింది. నాలుగు ప్రాంతాల్లో పూర్తిగా రోడ్డు దెబ్బతినడంతో మరమ్మతు చేసేందుకు టీటీడీ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఘాట్ రోడ్డు ధ్వంసమైంది. ముఖ్యంగా రెండో ఘాట్రోడ్డులో భారీ కొండ చరియ విరిగి పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు.
అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొదటి ఘాట్ రోడ్డు నుంచి విడతల వారీగా తిరుమలకు వెళ్లడానికి వాహనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో గోపీనాధ్ జెట్టి తెలిపారు.
రెండో ఘాట్ రోడ్డును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయన్నారు.
ఇవాళ ఉదయం 5.45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. తిరుమల పైకి వెళ్లే ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు.
ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.
పునరుద్ధరణ కోసం మూడు రోజుల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కావున భక్తులు దర్శనం వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. టిక్కెట్లు కలిగిన భక్తులు 6 నెలల్లో ఎప్పుడైన స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు.