అధికారం అంటేనే సంపద, స్వప్రయోజనాలు చక్కబెట్టుకోవడం అనే అభిప్రాయం స్థిరపడింది. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. అయితే ఆ పని చాలా తెలివిగా చేయాల్సి వుంటుంది. ఇందులో అధికార పార్టీ వైసీపీ మాత్రం చాలా ఫూర్ అని చెప్పక తప్పదు. ఏపీ అధికార పార్టీ ఏం చేసినా…న్యాయస్థానంలో చుక్కెదురవుతోంది. తాజాగా అలాంటిదే మరొక దాని గురించి తెలుసుకుందాం.
రాజకీయాలన్న తర్వాత క్రిమినల్ కేసులు సర్వసాధారణమే. అవి లేకపోతే వాళ్లు నాయకులే కానట్టు లెక్క. వివిధ సందర్భాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై గతంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ జీవోలు కూడా జారీ చేసింది. ఇక క్రిమినల్ కేసుల న్యూసెన్స్ తప్పిందని ఊపిరి పీల్చుకున్న సదరు వైసీపీ ప్రజాప్రతినిధులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది.
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవడాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు అప్రమత్తమైంది. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల ఉపసంహరణను హైకోర్టు సుమోటోగా తీసుకోవడం గమనార్హం. తనకు తానుగా హైకోర్టు విచారణ చేపట్టడంతో వైసీపీ ప్రజాప్రతినిధులు ఖంగుతిన్నారు.
ఈ మేరకు కేసుల ఉపసంహరణకు సంబంధించిన జీవోలు విడుదల చేసిన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఇవాళ ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని ఈ విధంగా ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయో వివరాలతో నివేదిక సమర్పించాలని ఆ కేసుల విచారణ జరుపుతున్న విజయవాడ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసుల విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే అధికార పార్టీ నేతలపై క్రిమినల్ కేసుల ఉపసంహరణను సవాల్ చేస్తూ ప్రతిపక్ష నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టే నుమోటోగా స్వీకరించడంతో ఆశ దోశ వడ అప్పడం అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు వెటకరిస్తున్నారు.