సంగీతానికి మ‌రోపేరే సిరివెన్నెల‌

నాకు సినిమాతో సంబంధం లేదు. ఎప్పుడూ ఏ సినిమా సెలెబ్రిటీలను కలవలేదు. కాని ఏప్పటికైనా ఏ రోజైనా ఒక సినిమా వ్యక్తిని కలవాలని అనుకుని, కలలు కని, నా ఊహల్లోనే ఎన్నో గంటలు మాట్లాడుకొని,…

నాకు సినిమాతో సంబంధం లేదు. ఎప్పుడూ ఏ సినిమా సెలెబ్రిటీలను కలవలేదు. కాని ఏప్పటికైనా ఏ రోజైనా ఒక సినిమా వ్యక్తిని కలవాలని అనుకుని, కలలు కని, నా ఊహల్లోనే ఎన్నో గంటలు మాట్లాడుకొని, నా అభిప్రాయాలు చెప్పాలని, నా బుల్లి బుర్రకి ఒచ్చినంత తెలుగుతో పొగడాలని, చాలా ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలని అనుకున్నది మాత్రం సిరివెన్నెల గారిని, కేవలం సిరివెన్నెల గారిని.

ఇది ఒక బయట వ్యక్తిగా, ఒక అభిమానిగా ఆయనకి ఎప్పటికీ చెప్పలేని మాటలు మీకు చెప్తున్నాను.

ఆయన తెలుగులో కాకుండా వేరే యే భాషలోనైనా రాసుంటే ఆయనకి ఇంకా ఎంతో కీర్తి ప్రతిష్ఠలు దక్కేవి.

ఆయన సినిమా కవి కాకుండా వేరే సాహిత్య ప్రక్రియలో ఉండుంటే ఆయనకి ఇంకెన్నో అవార్డులు రివార్డులు వచ్చేవి.

ఆయన ఒక పరిధిని దాటి శృంగారము, ద్వందార్ధం రాసుంటే ఇంకా ఎన్నో వేల పాటలు రాసుండేవారు. డబ్బు సంపాదించి ఉండేవారు.

సాధారణంగా ఒక సినిమా కవి గురించి మాట్లాడితే అందరికీ ముందు గుర్తొచ్చే పాటలు ఒక పది పదిహేను ఉంటాయి. ఎందుకంటే అందులో ఆ కవి తాలూకు సంతకం ఉంటుంది.  ఎక్కువ శాతం పాటలు ఒక సినిమా గ్రామర్లో వెళ్ళిపొతాయి. ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి, ఫస్ట్ డ్యూయెట్ ఒకటి, హీరో కష్టాలు తీరిపోయే పాట ఒకటీ, మాస్ పాట ఒకటీ..ఇలా..

కాని సిరివెన్నెల గారి ప్రతీ పాటలో ఆయన సంతకం ఉంటుంది. వినగానే ఈ పాట ఆయనది అని చెప్పెయ్యొచ్చు. ఆయనకి గొప్ప పాటలు, మమూలు పాటలు, చిల్లర పాటలు, అర్జెంటుగా డబ్బు కోసం రాసే పాటలు, డబుల్ మీనింగ్ పాటలు, సింగిల్ కార్దు కాబట్టి రాయాల్సిన పాటాలు ఉండవు. పాటంటే పాటే. పాట గొప్పది. అది సిరివెన్నెల గారు రాస్తే ఇంకా గొప్పది.

ఇన్ని రూల్స్ మధ్యలో ఒక పాట రాయాలి. అది ట్యూనుకు రాయాలి. కథలో పాట ఉండాలి. పాటలో కథ ఉండాలి. సినిమాలో పాట ఇమడాలి. సినిమా తీసేసి పాట వింటే కూడా బాగుండాలి. డైరెక్టరు గారికి, హీరోగారికి పాట నచ్చాలి. హీరోగారి ఫ్యాన్స్ కు పడికట్టు పదాలు పడాలి.

ఆడియెన్సుకి అర్ధ్యమయ్యే లెవెల్లో మాత్రమే ఉండాలి. పండితులని మెప్పించే పదప్రయోగం ఉండాలి. మేధావులని మెప్పించే ఫిలాసఫీ ఉండాలి. విమర్శకులని ఒప్పించే నీతి వాక్యాలు ఉండాలి. రొమాన్సు లిమిట్సులోనే ఉండాలి.

ఇవన్నిటినీ గెలవాలి. ఒక పల్లవి, రెండు చరణాలతో.. ఒక పాటతో కాదు. ప్రతీ పాటతో.  

నాకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చే ఉదాహరణలు. పొద్దున్నించీ టీవీలో వినిపించని పాటల గురించి.

ఆనగనగా ఒక రోజు సినిమాలో.. “ఓపలేనయా” పాట ఒకసారి వినండి. అక్షరాలను కరిగించి ట్యూనులో పోత పోస్తే సిరివెన్నెల పాట. “ఊరికే ఉరికే వయసులో కోరికే కొరికే…” అక్కడ ఆ ట్యూనుకు ఇంతకంతే అతికే పదాలు పడవేమో.

మావిచిగురు సినిమాలో “మాట ఇవ్వమ్మా చెల్లీ” పాట. హీరోయిన్ కి భర్త అంటే పిచ్చి ప్రేమ. అతను శ్రీరామచంద్రుడు. అతనిని వేరే అమ్మాయికి అప్పగించాలి. ఆయన ఉపయిగించిన పదాలు, “బంగారు సీతమ్మవై కనిపెట్టుకుంటావని”. రామయణంలోని ఉత్తరకాండ ఉంది ఆ ఒక్క వాక్యంలో. రాముడి పత్నీవ్రత్యం ఉంది ఆ వాక్యంలో. హీరోయిన్ అతిప్రేమ ఉంది. దర్శకుడు రెండు గంటల్లో చెప్పిన కథ రెండు ముక్కల్లో చెప్పేశారు.

అల్లరి మొగుడు సినిమాలో “రేపల్లె మళ్ళీ మురళి విన్నది” పాట. హీరో అల్లరి చిల్లరగా తిరిగే వాడు. సంగీతం నేర్చుకొనీ పెద్ద విద్వాన్సుడై మళ్ళీ ఊళ్ళోకి తిరిగి వస్తాడు. ఫస్ట్ బాల్లోనే సిక్సర్ కొట్టేశారు. క్రిష్ణుడు మళ్ళీ రేపల్లె  వచ్చాడని. ఇక్కడితోనే ఆపలేదు. పోతనగారు పూనారేమో. “ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నే వేణువయే” అనే భావం హీరోదే కాదు, మథురలో లేదా ద్వారకలో ఉన్న రోజుల్లో శ్రీకృష్ణుడిని అడిగినా చిన్ననాటి రోజుల గురించి ఇదే మాట చెప్పేవాడేమో.

ఇంద్ర సినిమాలో. “ఘల్లు ఘల్లుమనిష‌ చిరంజీవి గారు పెద్ద యాగం చేస్తారు వాన కోసం” భువిపై ఇంద్రుడు పిలిచెరా..వరుణా వరదై పలకరా.. పాట సందర్భం చెడకుండా… ఫాన్స్ ఈలలు ఆగకుండా..

అమ్మ రాజీనామా సినిమాలో.. “ఎవరు రాయగలరు” పాట.అమ్మ గురించి అందరూ రాశారు, సిరివెన్నెల గారు కూడా చాలా సార్లు రాశారు…అమ్మని దేవుడితో పోల్చచ్చు. ఎన్ని విశేషణాలైనా వాడచ్చు. ఎంత గొప్ప భాషైనా వాడొచ్చు. కాని మధ్యతరగతి మామూలు మనిషికి చెప్పే రీతిలో చెప్పారు, అమ్మ స్థానం గురించి, అమ్మ పడే కష్టం గురించి. “ఆలైనా బిడ్డలైనా.. ఒకరు పొతే ఇంకొకరు… అమ్మ పదవి ఖాళీ ఐనా… అమ్మ అవరు ఇంకెవరు..”

ఇక్కడ ఖాళీ ఐతే అనొచ్చు. కాని అనలేదు. అనకూడదు అమంగళం. ఖాళీ ఐనా అన్నారు. “అమ్మంటే విరమించని వట్టి వెట్టీ చాకిరీ…అమ్మంటే రాజీనామా ఎరుగనీ నౌకరీ…”. అక్షరలక్షలు అంటే ఇవేనేమో…

శృతిలయలు సినిమాలో “తెలవారదేమో స్వామి” పాట.. ఇందులో పదప్రయోగాలు.. “చెలువమునేలగ చెంగట లేవని” లాంటివి. అన్నమయ్య పాటలు విన్న ఎవరైనా ఇది కూడా ఆయన కీర్తనే కాబోలు అనుకుంటారు. అన్నమయ్య రాయలేదు కాని ఆయనే రాయించి ఉంటారు.

ఖడ్గం సినిమాలో “ముసుగు వెయ్యొద్దు మనసు మీద” పాట. ఫిలాసఫీ చెప్పే పాటలకి సందర్భం ఉండాలి. ఆంకురం, గాయం, రుద్రవీణ అలాంటివి. అప్పుడు ఎలాగో రాస్తారు. కాని ఇక్కడ ఒక క్లబ్బులో యూత్ పాడుకునే పాట. ఎంత స్వేచ్చ తీసుకొని ఏం రాసినా చెల్లిపొతుంది. ఇలాంటి సందర్భాల్లో మామూలుగా మన సినిమాల్లో ఎలాంటి సాహిత్యం ఉంటుందో మీకూ తెలుసు.

కాని ఆయన రాసింది, “కొంత కాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్తి కాదుగా.. కాస్త స్నేహం..కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా..అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటాన లేదుగా”.. ఎందుకు శాస్త్రిగారు మీకు ఇంత బాధ్యత?

క్షణక్షణం సినిమాలో “ముద్దిమ్మంది బుగ్గ”  హీరో హీరోయిన్ని ముద్దు అడగాలి. ఇలాంటి సందర్భం కవికి లైసెన్సు లాంటిది. ఎంత శృంగారం దట్టించినా… కొంత బూతు తగిలించినా నడిచిపోతుంది.. కాని తనకు తాను గీసుకున్న గీత దాటకుండా సున్నితమైన భావాన్ని పండించారు. “మోజులేదనకు..ఉందనుకో ఇందరిలో ఎలా మనకు. చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో” రొమాన్సుని కంట్రోల్ చెయ్యడానికి శాస్త్రిగారు చాల సార్లు హీరో హీరోయిన్ మధ్య సంభాషణ సృష్టించి హాస్యాన్ని వాడతారు.

ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నెన్నో. ఏం రాసినా, ఎంత రాసినా ఆయన అనుకున్న విలువలకు కట్టుబడి ఉండటం. పాట నాణ్యత తగ్గకుండా అది సాధించడం ఆయనకే చెల్లింది.

సంగీతాన్ని ఆపాతమధురం అని, సాహిత్యాన్ని ఆలోచనామృతం అని అంటారు.

మాధుర్యం పోయిన యేడు వెళ్ళిపోయింది. ఆలోచన ఇప్పుడు వెళ్ళిపోయింది. ప్చ్..