లైంగిక వేధింపుల కేసులో సీనియర్ హీరో అర్జున్ సర్జాకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మూడేళ్ల క్రితం లైంగిక వేధింపులపై నమోదైన కేసులో బెంగళూరు పోలీసులు విచారించారు. ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవంటూ న్యాయస్థానానికి పోలీసులు నివేదించారు.
మూడేళ్ల క్రితం అర్జున్‌పై హీరోయిన్ శృతి హరిహరన్ మీటు ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి విచారణ నేటి వరకూ కొనసాగడం గమనార్హం.
అసలేం జరిగిందంటే…
కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం 'నిబుణన్' సెట్స్‌లో (కన్నడలో 'విస్మయస) తనపై లైంగిక వేధింపులకు హీరో అర్జున్ పాల్పడినట్టు హీరోయిన్ శృతి హరిహరన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆమె ఏమన్నారంటే…
“ఎన్నో ఆశలతో సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు నా అనుభవంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పడం బాధగా ఉంది. కొన్ని భయంకర సంఘటనల నుంచి తెలివిగా తప్పించుకున్నా. చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిదే ఆయన కారణంగా చేదు అనుభవం ఎదురవుతుందని అసలు ఊహించలేదు. 2016లో అర్జున్‌తో వర్క్ చేసే అవకాశం రాగానే, ఎంతో ఉద్వేగానికి లోనయ్యా.
కానీ 'విస్మయ' సినిమా సెట్లో ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్స్‌లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా తడిమారు. 'మీటూ' ఉద్యమం ఇప్పుడు కాస్త పవర్‌ఫుల్‌గా తయారవుతోంది. అందుకే ఇప్పుడు పబ్లిక్‌గా చెబుతున్నాను'' అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు ఆరోపణలు చేశారామె.
అయితే హీరోయిన్ ఆరోపణలపై అర్జున్ సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని కొట్టి పారేశారు. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని, 150 సినిమాల్లో నటించానని, దాదాపు 60 మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నట్టు అర్జున్ చెప్పుకొచ్చారు. వారందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉందని, తనపై శ్రుతి ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తోందో అర్థం కావడం లేదని అర్జున్ వాపోయారు.
అలాగే సదరు సినిమా దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ కూడా అప్పట్లో హీరోయిన్ ఆరోపణలను ఖండించారు. తనకు టీనేజ్‌లో ఉన్న కూతురు ఉందని, ఇలాంటి సీన్స్‌లో నటించలేనని అర్జున్ తనతో చెప్పినట్టు దర్శకుడు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అర్జున్ కోరిక మేరకే ఆ సీన్లో రొమాంటిక్ ఫ్లేవర్‌ను తగ్గించానని, శ్రుతి హరిహరన్ చేసిన ఆరోపణలు విని షాక్ అయినట్టు దర్శకుడు అప్పట్లో చెప్పాడు. శ్రుతి ఆరోపణలపై పోలీసుల విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో అర్జున్‌కు క్లీన్చిట్ ఇచ్చారు.