కోటంరెడ్డి ట్యాపింగ్‌పై బాంబు పేల్చిన ఆప్త మిత్రుడు

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి త‌న ఫోన్ ట్యాపింగ్ చేశార‌నే చేస్తున్న ఆరోప‌ణ‌ల వెనుక అస‌లు నిజాన్ని ఆయ‌న ఆప్త మిత్రుడు రామ‌శివారెడ్డి బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. కోటంరెడ్డి డ్రామాలాడుతున్నార‌ని ఆయ‌న వాస్త‌వాల్ని లోకానికి…

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి త‌న ఫోన్ ట్యాపింగ్ చేశార‌నే చేస్తున్న ఆరోప‌ణ‌ల వెనుక అస‌లు నిజాన్ని ఆయ‌న ఆప్త మిత్రుడు రామ‌శివారెడ్డి బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. కోటంరెడ్డి డ్రామాలాడుతున్నార‌ని ఆయ‌న వాస్త‌వాల్ని లోకానికి తెలియ‌జేశారు. ఇవాళ రామ‌శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. కోటంరెడ్డి ఆరోపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్ త‌న ఫోన్‌లో అయిన‌ట్టు రామ‌శివారెడ్డి స్ప‌ష్టం చేశారు. మీడియా స‌మావేశంలో రామ‌శివారెడ్డి ఏమ‌న్నారో తెలుసుకుందాం.  

త‌న‌ది ఆండ్రాయిడ్‌ ఫోన్ అని అన్నారు. నా ఫోన్‌ లో ప్రతీకాల్ ఆటోమేటిక్‌గా రికార్డవుతుంద‌న్నారు. 15 ఏళ్లుగా తాను, కోటంరెడ్డి స్నేహితుల‌మ‌ని చెప్పారు. తాను రాజ‌కీయాలు వ‌దిలి కాంట్రాక్ట్ రంగంలోకి వెళ్లిన‌ట్టు ఆయ‌న చెప్పారు. త‌నతో అప్పుడ‌ప్పుడు ఫోన్‌లో సంభాషించేవాడ‌న్నారు. ప‌లుమార్లు త‌న ఇంటికి కోటంరెడ్డి వ‌చ్చేవాడ‌న్నారు. 30 ఏళ్లుగా వైఎస్సార్‌తో అనుబంధం వుంద‌న్నారు. వైఎస్సార్ కుటుంబంపై విశ్వాసం ఉంద‌న్నారు. గత డిసెంబ‌ర్‌లో మూడు లేదా నాలుగో వారంలో క‌లెక్ట‌రేట్‌లో ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింద‌న్నారు. అదే రోజు సాయంత్రం ఏడు గంట‌ల‌కు కోటంరెడ్డి త‌న‌కు ఫోన్ చేసిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు.

క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన విష‌యాల‌ను త‌న దృష్టికి తెచ్చార‌న్నారు. సీఎం, అలాగే ఐఏఎస్ సీనియ‌ర్ అధికారి రావ‌త్ విష‌యంలో తొంద‌ర‌పాటు మాటలు మాట్లాడ‌కుండా వుండాల్సింద‌ని తాను కోటంరెడ్డికి హిత‌వు చెప్పాన‌న్నారు. కానీ ఆయ‌న ఖాత‌రు చేయ‌లేద‌న్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కాంట్రాక్ట‌ర్ విష‌యమై త‌న‌తో సుదీర్ఘంగా మాట్లాడిన‌ట్టు చెప్పారు. కోటంరెడ్డి మాట‌ల‌తో ఏకీభ‌వించానన్నారు. త‌న సెల్‌ఫోన్‌లో సంభాష‌ణ ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంద‌న్నారు. త‌మ‌ ఇద్దరివీ ఐఫోన్‌లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారని ఆరోపించారు.

కాంట్రాక్ట‌ర్‌పై కోటంరెడ్డి ఆగ్ర‌హంగా ఉన్నార‌నే విష‌య‌మై తోటి కాంట్రాక్ట‌ర్ల‌తో చెబితే న‌మ్మ‌లేద‌న్నారు. ఇందుకు సాక్ష్యంగా త‌ప్పొఒప్పో మ‌రొక‌రికి కాల్ రికార్డ్ వాయిస్‌ను పంపాన‌న్నారు. అది వైర‌ల్ అయ్యింద‌న్నారు. రాజ‌కీయంగా ఇలాంటి ప‌రిస్థితి వస్తుంద‌ని తాను అస‌లు ఊహించ‌లేద‌న్నారు. అయితే ఈ విష‌య‌మై కేంద్ర‌హోంశాఖ‌కు లేఖ రాస్తున్న‌ట్టు కోటంరెడ్డి చెప్ప‌డంతో కొంత ఆందోళ‌న‌కు గుర‌య్యాన‌న్నారు.

వైఎస్సార్ కుటుంబంపై ఉన్న న‌మ్మ‌కం, మ‌మ‌కారం రీత్యా ఒక చిన్న విష‌య‌మై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డ‌డం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌తో జ‌గ‌న్ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డం ఇష్టం లేక త‌న‌కు తానుగా మీడియా ముందుకొచ్చిన‌ట్టు తెలిపారు. తానెవ‌రో సీఎం జ‌గ‌న్‌కు తెలియ‌ద‌న్నారు. కోటంరెడ్డి చెబుతున్నట్టు అది ఫోన్ ట్యాపింగ్ కాద‌న్నారు. కేవ‌లం వాయిస్ రికార్డు మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. 

ట్యాపింగ్‌ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్న‌ట్టు రామ‌శివారెడ్డి వెల్ల‌డించారు. త‌న‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాన‌న్నారు. దీంతో కోటంరెడ్డి ఇంత కాలం ఆడుతున్న డ్రామాల్ని స్నేహితుడు ఆధారాల‌తో స‌హా నిరూపించిన‌ట్టైంది.