టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ భవిష్యత్ రథసారథి లోకేశ్ కుప్పం కేంద్రంగా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికి 13వ రోజుకు చేరింది. యువగళం షో అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీనిపై అందరికీ ఎక్కువగా జనసేనాని పవన్‌కల్యాణ్ ఎక్కువగా సంతోషిస్తున్నారని సమాచారం.
చంద్రబాబుకు వయసు పైబడుతుండడం, తనకివే చివరి ఎన్నికలను స్వయంగా ఆయనే ప్రకటించడం, మరోవైపు పాదయాత్రలో లోకేశ్ తనను నాయకుడిగా నిరూపించుకోలేకపోతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండడంపై పవన్‌కల్యాణ్ ఖుషీఖుషీగా ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తానే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించే పరిస్థితి వచ్చిందని పవన్‌కల్యాణ్ సన్నిహితుల వద్ద చెబుతున్నారని సమాచారం. లోకేశ్ తనకు తానుగా నెత్తిన పాదయాత్ర అనే భస్మాసుర పాదం పెట్టుకున్నారని పవన్ అభిప్రాయంగా ఆయన అభిమానులు అంటున్నారు. ఈ రాజకీయ పరిణామాల కోసం ఎదురు చూస్తున్నట్టు జనసేన నేతలు అంటున్నారు.
లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అయిన నేపథ్యంలో పవన్‌కల్యాణ్ చేపట్టే వారాహి ప్రచార యాత్రపై అందరి కన్ను పడింది. టాలీవుడ్ అగ్రహీరోగా పవన్‌కల్యాణ్‌కు సినీ గ్లామర్ ప్లస్ అవుతుంది. వాహన యాత్రకు ఆయన వెళ్లడమే ఆలస్యం, జనం తండోపతండాలుగా వస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.
తమ నాయకుడు రంగంలోకి దిగితే, లోకేశ్‌ను పట్టించుకునే దిక్కు వుండదని జనసేన శ్రేణులు అంటున్నారు. లోకేశ్ పాదయాత్రకు జనం అంతంత మాత్రమే వస్తున్న నేపథ్యంలో, టీడీపీపై ఆగ్రహం తగ్గలేదని అంటున్నారు. ఇదే జనసేనకు కలిసొచ్చే అంశంగా పవన్ అభిమానులు అంటున్నారు.
లోకేశ్ పాదయాత్ర పుణ్యమా అని … ఇంతకాలం చంద్రబాబు సభలకు జనం వెల్లువెత్తారనే సంబరం ఆవిరవుతోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇంత వరకూ చంద్రబాబు ఎక్కడికెళ్లినా జనం తండోపతండాలుగా వస్తుండడంతో అధికారం తమదే అనే ధీమా టీడీపీ నేతల్లో కనిపించింది. లోకేశ్ పాదయాత్రకు రమ్మన్నా జనం రాకపోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. దీంతో తమపై టీడీపీ ఆధారపడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని జనసేనాని సంబరపడుతున్నారు.
లోకేశ్ పాదయాత్ర ఇట్లే సాగితే… 50-70 మధ్య సీట్లు ఇస్తే తప్ప జనసేన ఒప్పుకోదనే డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. దగ్గుతా పోతే శొంటి పిరమైందనే సామెత రాజకీయాలకు సైతం వర్తిస్తుంది.