య‌న‌మ‌ల సోద‌రుడు వైసీపీలో చేర‌తాడ‌ని…ఆగ‌మేఘాల‌పై!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి సోద‌రుడు కృష్ణుడు వైసీపీలో చేర‌తాడ‌నే ప్ర‌చారంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అప్ర‌మ‌త్తమైంది. దీంతో ఆయ‌న్ను ఆగ‌మేఘాల‌పై చంద్ర‌బాబునాయుడి వ‌ద్ద‌కు టీడీపీ నేత‌లు తీసుకెళ్లారు. కూతురి కోసం…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి సోద‌రుడు కృష్ణుడు వైసీపీలో చేర‌తాడ‌నే ప్ర‌చారంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అప్ర‌మ‌త్తమైంది. దీంతో ఆయ‌న్ను ఆగ‌మేఘాల‌పై చంద్ర‌బాబునాయుడి వ‌ద్ద‌కు టీడీపీ నేత‌లు తీసుకెళ్లారు. కూతురి కోసం త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను అన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బ‌లి తీసుకున్నాడ‌నే ఆగ్ర‌హంతో కృష్ణుడు ఉన్న సంగ‌తి తెలిసిందే. బాబు బుజ్జ‌గింపుతో కృష్ణుడు పార్టీలో కొన‌సాగుతారా? లేదా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తూర్పుగోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి కుమార్తె దివ్యను ఇటీవ‌ల టీడీపీ అధిష్టానం నియ‌మించింది. ఈ నియామ‌కంపై రామ‌కృష్ణుడి సోద‌రుడు కృష్ణుడు తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. క‌నీసం మాట మాత్ర‌మైనా చెప్ప‌కుండా త‌న‌ను తొల‌గించి, అన్న కుమార్తెను నియ‌మించ‌డం ఏంట‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు తుని నుంచి వ‌రుస‌గా మూడుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

త‌న త‌మ్ముడిని ఎన్నిసార్లు నిలిపినా ఓట‌మి త‌ప్ప‌, టీడీపీ గెల‌వ‌లేద‌ని చంద్ర‌బాబుకు స్వ‌యంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చెప్పిన‌ట్టు తెలిసింది. త‌మ్ముడికి బ‌దులు కుమార్తెకు సీటు ఇవ్వాల‌ని రామ‌కృష్ణుడు ప‌ట్టుప‌ట్టారు. దీంతో ఆయ‌న్ను కాద‌న‌లేక య‌న‌మల దివ్య‌ను తుని ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. ఇదే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో య‌న‌మ‌ల కృష్ణుడికి వైసీపీ గాలం వేస్తున్న‌ట్టు టీడీపీ ప‌సిగ‌ట్టింది.

అదే జ‌రిగితే టీడీపీ న‌ష్ట‌పోతుంద‌ని ఆందోళ‌న‌కు గురైన నాయ‌కులు వెంట‌నే కృష్ణుడిని వెంట‌బెట్టుకుని చంద్ర‌బాబు వ‌ద్ద‌కెళ్లారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుతో కృష్ణుడి భేటీ సాగుతోంది. చంద్ర‌బాబు ఎలాంటి హామీ ఇచ్చారో కృష్ణుడు చెబితే త‌ప్ప తెలిసే అవ‌కాశం వుండ‌దు. కృష్ణుడు సంతృప్తి చెందేలా హామీ ఇస్తే త‌ప్ప‌, ఆయ‌న పార్టీలో కొన‌సాగే ప‌రిస్థితి వుండ‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.