ఆ ప్రశ్నలో తప్పేముంది.. కల్యాణ్ రామ్ కు ఏమైంది?

“మీ అందరికంటే ముందు నేను సినిమా చూశాను. చాలా బాగుంది. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ.” ప్రీ-రిలీజ్ ఫంక్షన్లలో రెగ్యులర్ గా వినిపించే కామెంట్ ఇది. ఇక కల్యాణ్ రామ్ సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్…

“మీ అందరికంటే ముందు నేను సినిమా చూశాను. చాలా బాగుంది. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ.” ప్రీ-రిలీజ్ ఫంక్షన్లలో రెగ్యులర్ గా వినిపించే కామెంట్ ఇది. ఇక కల్యాణ్ రామ్ సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ స్టాక్ డైలాగ్ ఇది.

కల్యాణ్ రామ్ నటించిన దాదాపు ప్రతి సినిమాను అందరికంటే ముందు చూస్తాడు ఎన్టీఆర్. తమ్ముడి జడ్జిమెంట్ పై నమ్మకం కావొచ్చు లేదా తారక్ చూడాలనే సెంటిమెంట్ అనుకోవచ్చు.. కారణం ఏదైనా కల్యాణ్ రామ్ సినిమాల్ని ముందే చూస్తాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆ సినిమా గురించి గొప్పగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో చెబుతాడు.

బింబిసార సినిమాకు కూడా ఇదే జరిగింది. అందరికంటే ముందు చూశాడు, సినిమా బాగుందని చెప్పాడు, బ్లాక్ బస్టర్ పక్కా అన్నాడు. అదే జరిగింది. కానీ అమిగోస్ విషయంలో ఇలా జరిగినట్టు లేదు. మరీ ముఖ్యంగా కల్యాణ్ రామ్ వ్యవహార శైలి ఈ గందరగోళానికి మరింత కారణమైంది.

ఈరోజు కొంతమంది మీడియా జనాలకు అమిగోస్ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూ ఇచ్చాడు కల్యాణ్ రామ్. ఆ ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, దానికి కల్యాణ్ రామ్ సమాధానం యథాతథంగా ఇక్కడ…

సినీ జర్నలిస్ట్: అమిగోస్ సినిమాను ఎన్టీఆర్ కు చూపించారా? చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి?

కల్యాణ్ రామ్: మీరు అడుగుతారని నేను ఆల్రెడీ ఊహించాను.. నేను చెప్పను.. నెక్ట్స్ క్వశ్చన్..

ఇదీ కల్యాణ్ రామ్ సమాధానం. తన సినిమాలకు సంబంధించి ఎప్పుడూ తారక్ జడ్జిమెంట్ గురించి గొప్పగా చెబుతాడు కల్యాణ్ రామ్. తమ్ముడి సలహాలు తీసుకున్నానని, తారక్ ముందే మూవీ చూశాడని ఇలా ఏదో ఒకటి చెబుతాడు. కానీ ఈసారి అమిగోస్ విషయంలో మాత్రం కల్యాణ్ రామ్ ఈ ప్రశ్నను దాటేశాడు. తారక్ సినిమా చూశాడు కానీ అతడికి నచ్చలేదు అనుకోవాలా.. లేక ఎన్టీఆర్ అసలు చూడలేదా.. ఏదో ఒకటి చెబితే బాగుండేది. నిర్ద్వందంగా స్కిప్ చేయడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.

గమ్మత్తుగా అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడలేదు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మైక్ పుచ్చుకున్న తారక్, తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయని స్టార్ట్ చేసి, అమిగోస్ సినిమా చూశానని లేదా చూడలేదని చెప్పలేదు. కేవలం పెద్ద హిట్టవ్వాలని మాత్రం కోరుకున్నాడు.

బహుశా.. అమిగోస్ సినిమాను తారక్ చూసినట్టు లేడు. అదే విషయాన్ని కల్యాణ్ రామ్ చెబితే సరిపోయేది. ఏదో అడక్కూడని ప్రశ్నను జర్నలిస్ట్ అడిగినట్టు, అత్యంత వివాదాస్పదమైన క్వశ్చన్ ను ఫేస్ చేసినట్టు కల్యాణ్ రామ్ రియాక్ట్ అవ్వడం విడ్డూరంగా ఉంది.