హీరోగారికి అద్దెర‌త్న పుర‌స్కారం

సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఏదో ఒక విమ‌ర్శ చేయ‌క‌పోతే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నిద్ర‌ప‌ట్టేలా లేదు. జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తే త‌ప్ప‌, త‌న ఉనికిని కాపాడుకోలేన‌నే ఆలోచ‌న ఆయ‌న‌లో పుట్టింది. దీంతో జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా…

సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఏదో ఒక విమ‌ర్శ చేయ‌క‌పోతే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నిద్ర‌ప‌ట్టేలా లేదు. జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తే త‌ప్ప‌, త‌న ఉనికిని కాపాడుకోలేన‌నే ఆలోచ‌న ఆయ‌న‌లో పుట్టింది. దీంతో జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యంగ్య పోస్టులు పెడుతూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా అప్పులు చేస్తోంద‌ని ప్ర‌జానీకానికి చెప్పేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాగా శ్ర‌మించాల్సి వచ్చింది. జ‌గ‌న్‌పై ఓ కార్టూన్ వేయించాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. అప్పుల‌తో రాష్ట్ర పేరును మార్మోగిస్తున్న కార‌ణంగా జ‌గ‌న్‌కు త‌న ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు కూడా చెప్పారాయ‌న‌. మొత్తానికి సీఎంకు అప్పు ర‌త్న అనే పుర‌స్కారాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంద‌జేశారు.

జ‌గ‌న్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌ల్ని వైసీపీ తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా ప‌వ‌న్‌కు సైతం వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు ఓ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేయ‌డం విశేషం. ప‌వ‌న్‌కు అద్దె ర‌త్న అనే పుర‌స్కారాన్ని అంద‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు స‌హేతుక‌మైన కార‌ణాన్ని కూడా వారు వివ‌రించారు.

తన పార్టీని ప్రతి ఎన్నికల్లో అద్దెకిచ్చి, ఊడిగం చేసి, కోట్లు పోగేసుకునే ప‌వ‌న్‌, ఎంతో ఇష్టపడే అభిమానుల్ని, తన కులం వాళ్ళని, అమాయకులైన వామపక్ష కార్యకర్తలను ప్రతిసారి మోసం చేస్తున్నందుకు  “అద్దె రత్న” అనే బిరుదును ఇవ్వ‌డ‌మే ఉత్త‌మమైంద‌ని నిర్ధారించారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన‌ను అద్దెకిచ్చేందుకు సిద్ధ‌మైన సంగ‌తి ఏపీలో చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతార‌ని దెప్పి పొడుస్తున్నారు.

ఒక సీఎంగా వైఎస్ జ‌గ‌న్ మాత్ర‌మే అప్పులు చేయ‌డం లేద‌ని, అన్ని రాష్ట్రాలు చేస్తున్న‌దే ఆయ‌న చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న‌దేంటో ప‌వ‌న్ చెబితే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. సీఎం జ‌గ‌న్ అప్పులు చేస్తూ తీసుకొచ్చిన డ‌బ్బుని ఏం చేస్తున్నార‌నేదే ముఖ్య‌మైన ప్ర‌శ్న అని అంటున్నారు. మోస‌గించిన అడ‌బిడ్డ‌ల‌కి అప్పు చేసి తీసుకొచ్చిన సొమ్ముతో భ‌ర‌ణం చెల్లించ‌లేద‌ని ప‌వ‌న్‌కు చుర‌క‌లంటిస్తున్నారు.