ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తమకు గిట్టని ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతలను కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరికించిందనే విమర్శ వుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఆయన్ను ఢిల్లీకి తరలించారు. ఇదే కేసులో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడే గౌతమ్ మల్హోత్రా. బీజేపీని కాదని ఆ పార్టీ వేరుపడిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటి వరకూ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన రెండో ఎఫ్ఐఆర్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గోరంట్ల బుచ్చిబాబు, మల్హోత్రా అరెస్ట్ వెనుక మోదీ సర్కార్ భారీ స్కెచ్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కీలక నాయకుల అరెస్ట్ కోసమే మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా చిన్న చేపల్ని అదుపులోకి తీసుకుంటోందన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉన్న వారెవరినీ విడిచిపెట్టమనే సంకేతాల్ని ఇవ్వడంలో భాగంగానే ఈ అరెస్ట్‌లను చూడాల్సి వుంటుంది.
అలాగే రానున్న రోజుల్లో కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తే విమర్శలకు ఆస్కారం లేకుండా, చట్టానికి ఎవరూ అతీతులు కాదనే వాదనను బలంగా వినిపించేందుకే తతంగాన్ని నడిపిస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. మొత్తానికి తమకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తామనే నేతలను అణచివేసేందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను బీజేపీ ఆయుధంగా వాడుకుంటోంది.