ఉత్తరాంధ్రా పట్టభద్రుల స్థానానికి మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ పోటీ చేస్తోంది. ఆరు నెలల ముందే తన అభ్యర్ధిని ఆ పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం కూడా ఆ వెనకే అభ్యర్ధిని ప్రకటించినా లేటెస్ట్ గా చూస్తే ఉన్నఫళంగా మార్చేసింది. భీమిలీకి చెందిన మహిళా అభ్యర్ధి స్థానంలో చోడవరానికి చెందిన ఒక డాక్టర్ గారికి టికెట్ ఇచ్చింది.
ఇక్కడే తెలుగుదేశం తన తెలివిని చూపించింది అని అంటున్నారు. కొత్త అభ్యర్ధి కాపు సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో జనసేన మద్దతు తీసుకునేందుకే తెలుగుదేశం ఈ విధంగా చేసింది అని అంటున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ వరిష్ట నాయకుడు దివంగత పీవీ చలపతిరావు కుమారుడు పీవీన్ మాధవ్ మరోసారి పోటీ చేస్తున్నారు.
బీజేపీతో అధికార పొత్తు ఉన్న జనసేన ఇపుడు ఎవరికి మద్దతు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా ఉంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించాలని ఈ మధ్యనే ఉత్తరాంధ్ర అంతటా కాలికి బలపం కట్టుకుని బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తిరుగుతున్నారు. అయితే బీజేపీకి జనసేన నుంచి మద్దతు ఇస్తున్న సంకేతాలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు అంటున్నారు.
విశాఖకు తరచూ వస్తున్న సోము వీర్రాజు అవసరం అయితే ఒంటరిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న జీవీఎల్ నరసింహారావు మాత్రం జనసేనతో పొత్తు ఉంటుంది అంటున్నారు. ఇలా ఇద్దరు కీలక నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా జనసేన నుంచి అయితే అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ స్టేట్మెంట్ రావడంలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిని పోటీ పెట్టకుండా జనసేన ఉండడంతో ఆ పార్టీ మద్దతు కోసం తెలుగుదేశం కొత్త ఎత్తులు వేస్తోంది. మిత్రపక్షం అయిన బీజేపీ మాత్రం జనసేనతో కలసి అడుగులు వేయడంలేదు. జనసేన కూడా తెలుగుదేశానికే మద్దతు ఇస్తుందని ప్రచారం సాగుతోంది. ఎటూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందని భావిస్తున్న జనసేన ఆ బంధాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే గట్టిగా వేసుకునేందుకు చూస్తుందని అంటున్నారు.
తెలుగుదేశం అభ్యర్ధిని మార్చి కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం, జనసేన మౌనం, బీజేపీ ఒంటరు పోరు ప్రకటనలు ఇవన్నీ చూస్తూంటే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికలలోనే జనసేన కొత్త మిత్రుడిని వెతుక్కుంటుందా అన్నదే డౌట్ గా ఉందిట. అదే జరిగితే బీజేపీ సిట్టింగ్ సీటులో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. జనసేన మిత్రుడే అంటున్న బీజేపీ మాటకు ఎంత విలువ ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తేల్చేస్తాయని అంటున్నారు.