'ప్రతిరోజూ పండగే' ట్రెయిలర్ చూసిన వాళ్లలో చాలా మంది ఇది సంక్రాంతి పండక్కి రావాల్సిన సినిమా అని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు సంక్రాంతికి వచ్చి బాగా ఆడిన సందర్భాలు ఎన్నో వున్నాయి.
అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా డిసెంబర్ 20నే విడుదల చేస్తున్నారు. ఇందుకు కారణం సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' రిలీజ్ అవుతుండడమే.
వేరే ఫ్యామిలీకి చెందిన హీరోది అయితే 'ప్రతిరోజూ పండగే'ని సంక్రాంతికే విడుదల చేసి వుండేవారేమో. కానీ మెగా హీరోలు కనుక, రెండిటికీ అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామి కనుక పండక్కి వచ్చే అదృష్టం సాయి ధరమ్ తేజ్‌కి దక్కలేదు.
మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇద్దరూ ఇలా పలుమార్లు రాజీ పడాల్సి వస్తోంది. తమ కుటుంబం నుంచే పెద్ద స్టార్లు వుండడంతో వాళ్ల సినిమాలు మంచి సీజన్లకి, పండుగలకి వస్తోంటే వీరు వేరే డేట్లు వెతుక్కోవాల్సి వస్తుంది.
చిన్న సినిమా కనుక 'ప్రతిరోజూ పండగే'కి సంక్రాంతి రిలీజ్ అవసరం లేకపోవచ్చు. కానీ సినిమా హిట్ రేంజ్ పెరగడానికి, తద్వారా హీరో మార్కెట్ పెరగడానికి పండుగ రిలీజ్‌లు దోహదపడతాయి.
పలుమార్లు తన చిత్రాలని ప్రీమియమ్ రిలీజ్ డేట్లకి రిలీజ్ చేసుకోలేకపోయిన సాయి ధరమ్ తేజ్ ఈసారి కూడా బన్నీ కోసం రాజీ పడక తప్పింది కాదు.