ఆనం మాట‌లు వింటే జ‌గ‌న్ ఏమైపోవాలి?

ఆరు నెల‌ల్లో మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకుంటాన‌ని, క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటాన‌ని, ఎమ్మెల్యేలంతా  స‌హ‌క రించాల‌ని…శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా  ఎన్నుకున్న సంద‌ర్భంలో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి వైఎస్ జ‌గ‌న్ అన్న‌మాట‌లివి. ఆరు నెల‌ల కాలం…

ఆరు నెల‌ల్లో మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకుంటాన‌ని, క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటాన‌ని, ఎమ్మెల్యేలంతా  స‌హ‌క రించాల‌ని…శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా  ఎన్నుకున్న సంద‌ర్భంలో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి వైఎస్ జ‌గ‌న్ అన్న‌మాట‌లివి. ఆరు నెల‌ల కాలం క‌ళ్లు తెర‌చి మూసేలోపు మంచు గ‌డ్డ‌లా క‌రిగిపోయింది. స‌మాజంలో పెను మార్పులు తీసుకురావాల‌నే జ‌గ‌న్ క‌ల‌ల‌ను సొంత‌పార్టీ ఎమ్మెల్యేలే క‌ల్ల‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

అనేక ర‌కాల మాఫీయాలు జ‌గ‌న్ పాల‌న‌లో విజృంభిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను వైసీపీ నేత‌లు లైట్ తీసుకుంటూ వ‌స్తున్నారు. కానీ వైసీపీలో సీనియ‌ర్ నేత‌, పాల‌నానుభ‌వం క‌లిగిన వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి శుక్ర‌వారం వెంక‌ట‌గిరిలో సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

ఏ ప్ర‌తిప‌క్ష నేత‌లు చేయ‌ని విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై ప‌రోక్షంగా ఆనం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ “ఇవాళ లేవా మాఫియాలు. నెల్లూరు న‌గ‌రంలో క‌బ్జాకోరులు, బెట్టింగ్‌రాయుళ్లు ఉన్నారు. అనేక మాఫియాలు నెల్లూరులోనే ఉన్నాయి. ఆత్మ‌స్థైర్యంతో, గుండె నిబ్బ‌రంతో ప‌నిచేసే పోలీసు అధికారులు ఉన్నా, ఒక అడుగు ముందుకు వేయాల‌న్నా…వెన‌క్కి తిరిగి వారి ఉద్యోగ భ‌ద్ర‌త‌ను చూసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది” అని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.  

“చేస్తామ‌నే న‌మ్మ‌కం ఉన్నా చేయ‌లేని ప‌రిస్థితి. శ్రీ‌నివాస్‌రెడ్డి ఎస్పీగా ఉన్న‌ప్ప‌టి కంటే ఇవాళ నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా, లిక్క‌ర్ మాఫియా, ల్యాండ్‌మాఫియా, శ్యాండ్ మాఫియా…ఏ మాఫియా కావాలో చెప్పండి. స్వ‌చ్ఛమైన తేనె కావాలంటే వెంక‌ట‌గిరి అడ‌వికి రావాలి. నీకే ర‌కం మాఫియా కావాల‌న్నా నెల్లూరు న‌గ‌రానికి వెళ్లండి. ఏం ఫ‌ర్వాలేదు. మా నెల్లూరు ప్ర‌జ‌లు చెప్పుకోలేక అల్లాడుతున్నారు” అని ఫైర్ అయ్యాడు.

 “కొద్ది మంది గ్యాంగులు, గ్యాంగ‌స్ట‌ర్స్‌కి నెల్లూరు ప‌ట్ట‌ణాన్ని అప్ప‌గించేశారు. ఇవాళ వేలాది కుటుంబాలు, ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు బ‌య‌టికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితుల‌ను మెరుగుప‌ర‌చాలంటే అంత‌టి ఆత్మ‌స్థైర్యం గ‌ల అధికారులు కావాలి.  ఉన్నారా, ఉంటే మంచిద‌నుకుంటున్నాను. అలాంటి అధికారులు వ‌స్తే ఎమ్మెల్యేల‌మైన మేము ఉన్నీయం క‌దా?  వెంట‌నే ఇక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని అంటాం. ఆ విధంగా ముగ్గురు ఎస్పీల‌ను మార్చేశాం క‌దా. ఏడాది కూడా చేయ‌ని ఎస్పీలు న‌లుగురున్నారు. దీనికి కార‌ణం మా ప్ర‌జా ప్ర‌తినిధుల జోక్య‌మే. వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌నిచేయ‌నిస్తే ఇలాంటివి ఆప‌డం సుల‌భం” అని ఆయ‌న ముక్తాయింపు ఇచ్చారు.

నెల్లూరు ఎస్పీ ఐశ్వ‌ర్య ర‌స్తోగిని బ‌దిలీ చేసి ఆయ‌న స్థానంలో భాస్క‌ర్ భూష‌ణ్‌ను జ‌గ‌న్ స‌ర్కార్ తాజాగా నియ‌మించిన నేప‌థ్యంలో ఆనం ఆరోప‌ణ‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అంతేకాకుండా టీడీపీ పాల‌న‌లో క్రికెట్ బెట్టింగ్ ఆరోప‌ణ‌ల‌పై నెల్లూరు న‌గ‌ర‌, రూర‌ల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాద‌వ్‌, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో ఏ ర‌కం మాఫియా కావాల‌న్నా నెల్లూరు న‌గ‌రానికి రావాల‌ని వ్యంగ్యంగా ఆహ్వానించ‌డం వెనుక సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను ఎత్తిపొడ‌వ‌డ‌మే ఉద్దేశ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ప‌దికి ప‌ది స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులే గెలుపొందారు.

ఒక సీనియ‌ర్ నేత , అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ఆనం ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయ‌న ఆరోప‌ణ‌లు నిజ‌మైతే అంతిమంగా పార్టీకే దెబ్బ‌. కానీ త‌న పాల‌న‌లో అంతా గొప్ప‌గా ఉంద‌నుకుంటూ మురిసిపోతున్న జ‌గ‌న్‌కు మాత్రం ఆనం విమ‌ర్శ‌లు చేదు గులిక‌ల్లాంటివ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.