బాలయ్య, పవన్ కల్యాణ్ ఇద్దరూ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరు తండ్రి వారసత్వాన్ని ఎంచుకుంటే, ఇంకొకరు అన్నయ్య చూపించిన దారిలోని సినిమాలు, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
గత ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు పార్టీ ఓడిపోయి బాలయ్య గెలిచారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. కానీ ప్రస్తుతం ఇద్దరు వైఖరుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకరు వాస్తవాన్ని గ్రహిస్తే, మరొకరు భ్రమల్లోనే జీవిస్తున్నారు.
ఈ ఆరు నెలల్లో బాలయ్య ఓ సినిమా పూర్తి చేశారు, రెండో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. పవన్ కల్యాణ్ పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం అంటూ తిరుగుతున్నారు. అలాఅని సినిమాలు చేయనని గట్టిగా చెప్పడం లేదు. ఓవైపు నిర్మాతలు, దర్శకులకు కన్నుగీటుతూనే ఉన్నారు.
హిందూపూర్ నియోజకవర్గంలో గెలిచినా తనకు అక్కడ అంత సీన్ లేదని, తొలి పర్యటనలోనే బాలయ్య గ్రహించారు. దీంతో సినిమాలే బెటర్ అనుకుంటూ వెండితెరవైపే వెళ్లిపోయారు. పార్టీ కోసం బావ చంద్రబాబు కష్టపడుతున్నా, అల్లుడు లోకేష్ ట్విట్టర్ లో గగ్గోలు పెడుతున్నా ఏదీ పట్టనట్టున్నారు. తాజాగా టీడీపీ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి కనీసం నందమూరి ఫ్యామిలీ తరపున బాలకృష్ణ హాజరు కాలేదు. ప్రస్తుతం బాలయ్య లోకం సినిమాలే.
ఇక పవన్ కల్యాణ్ సంగతి చూద్దాం. పవన్ కి ఇంకా భ్రమలు తొలగిపోలేదు. కేవలం ఒకేఒక్క సీటు ఇచ్చి ప్రజలు అతడ్ని, అతడి పార్టీని మూల కూర్చోబెట్టినా పవన్ ఇంకా తన రింగ్ మాస్టర్ అనే భ్రమల్లో ఉన్నారు. అదే భ్రమలో మాట్లాడుతున్నారు కూడా. 151 సీట్ల భారీ మెజార్టీతో జగన్ గెలిచి ముఖ్యమంత్రి అయినా, ఆయన్ను కనీసం సీఎం అని సంబోధించేందుకు కూడా పవన్ ఇష్టపడటం లేదంటే, జనసేనాని వైఖరిని అర్థం చేసుకోవచ్చు.
బాలయ్య వాస్తవంలో బతుకుతుంటే, పవన్ భ్రమల్లో మునిగితేలుతున్నారు. టీడీపీకి ఇక సీన్ లేదని గ్రహించిన బాలయ్య.. స్వయానా బావ-అల్లుడికి దూరంగా ఉంటుంటే.. పవన్ మాత్రం అదే పార్టీతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. కనీసం బాలకృష్ణను చూసైనా పవన్ నేర్చుకోవాలి. భ్రమల్లోంచి వాస్తవంలోకి రావాలి.
తను మళ్లీ సినిమాల్లోకి వెళ్లే విషయంపైనే స్పష్టంగా ప్రకటన చేయలేకపోతున్న పవన్.. పాతికేళ్ల ప్రస్థానం, ప్రజాసమస్యలు తీరుస్తానంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేయడం భ్రమలు కాక మరేంటి!