ఇకపై వాట్సాప్ లో కూడా యాడ్స్ బాధ తప్పదా? ఛాటింగ్ ఓపెన్ చేస్తే యాడ్ ప్రత్యక్షమౌతుందా? ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే కొంత రుసుము చెల్లించాల్సి వస్తుందా? గడిచిన 24 గంటలుగా వినిపిస్తున్న పుకార్లు ఇవి. అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయిన ఈ ఊహాగానాలపై వాట్సాప్ మాతృసంస్థ మెటా స్పందించింది.
వాట్సాప్ ను ప్రకటనలకు వేదికగా మారుస్తున్నారనే ఊహాగానాల్ని మెటా సంస్థ ఖండించింది. వాట్సాప్ హోమ్ స్క్రీన్ తో పాటు, ఛాటింగ్స్ లో యాడ్స్ ను పెట్టే అంశంపై మెటాలోని కొన్ని బృందాలు రీసెర్చ్ చేశాయంటూ ఫైనాన్షియల్ టైమ్స్ విడుదల చేసిన నివేదికను మెగా తప్పుపట్టింది.
వాట్సాప్ లో యాడ్స్ ప్రవేశపెట్టే అంశంపై మెటాలో ఎలాంటి రీసెర్చ్ జరగలేదని, అసలు సంస్థలో అలాంటి చర్చ కూడా లేదని స్పష్టం చేసిన మెటా.. రాబోయే రోజుల్లో కూడా వాట్సాప్ లో వాణిజ్య ప్రకటనలు ప్రవేశపెట్టే ప్రణాళికలేం లేవని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారు.
ఇనస్టాగ్రామ్ లో ఇప్పటికే యాడ్స్ ప్రవేశపెట్టింది మెటా. దీని ద్వారా సదరు సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతోంది. అప్పట్నుంచే వాట్సాప్ లో కూడా యాడ్స్ ప్రవేశపెడుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా వాటిని మెటా క్లియర్ చేసింది.