టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఇక అధికారికంగా తేలాల్సింది సీట్ల సంఖ్యే. జనసేన సీట్ల సంఖ్యపై టీడీపీ ఓ లెక్క చెబుతోంది. అయితే జనసేన ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తుందో ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా టీడీపీ, జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా తమ నాయకుడు పవన్‌కల్యాణే సరైన ఎంపికగా జనసేన అభిప్రాయపడుతోంది. దీనికి కారణాలను కూడా జనసేన నేతలు చెబుతున్నారు.
వైఎస్ జగన్‌ను అధికార గద్దె నుంచి దింపాలనే ఆశయంతో పవన్‌కల్యాణ్ టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నట్టు జనసేన నేతలు చెబుతున్నారు. నిజానికి ప్రత్యామ్నాయ శక్తిగా జనసేనాని ఏపీ రాజకీయాల్లోకి వచ్చారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతో పొత్తు కుదుర్చుకున్నట్టు జనసేన నాయకులు వివరిస్తున్నారు. ఏ రకంగా చూసినా తమ నాయకుడు పవన్‌కల్యాణ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి వెళ్లే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
పవన్‌కల్యాణ్ సామాజిక వర్గమైన కాపు, బలిజ తదితర అనుబంధ కులాలు ఇంత వరకూ తమ వాడు సీఎం కాలేదనే నిరాశలో ఉన్నారని అంటున్నారు. పవన్ సీఎం అభ్యర్థి అయితే దాదాపు 14-15 శాతం ఓట్లు ఏకపక్షంగా టీడీపీ, జనసేన కూటమికి పడతాయని విశ్లేషిస్తున్నారు. ఇదే చంద్రబాబు సామాజిక వర్గం ఓట్లన్నీ కలిపినా నాలుగైదు శాతానికి మించి లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా పవన్‌కు అన్ని రకాలుగా క్లీన్ ఇమేజ్ వుందని చెబుతున్నారు. ఇంతకాలం చంద్రబాబునాయుడు తానొక ఉప్పు, నిప్పు అని గొప్పలు చెప్పుకునేవారని, ఇప్పుడు ఆయనపై అవినీతి కేసులు ఒక్కక్కటిగా బయటికి రావడం, తాజాగా జైలుకెళ్లడంతో టీడీపీ, వైసీపీ దొందు దొందే అనే అభిప్రాయం జనంలో బలంగా వుందనే వాదనను జనసేన తెరపైకి తెస్తోంది. రాష్ట్రానికి నీతివంతమైన పాలన అందించాలంటే పవన్ ఒక్కడి వల్లే సాధ్యమని, ఇందుకు చంద్రబాబు సహకరించాలని వారు కోరుతున్నారు.
పవన్‌కల్యాణ్‌ను కేవలం తమ పల్లకీ మోసే నాయకుడిగా టీడీపీ భావిస్తే, ఆయన సామాజిక వర్గం వ్యతిరేకంగా ఓట్లు వేసే ప్రమాదం వుందని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని నిజాయతీ కలిగిన పవన్‌ను టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ నెమ్మదిగా తెరపైకి రావడం గమనార్హం.