టీడీపీ, జనసేన మధ్య పొత్తుపై ఏపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వుంటుందని తామెప్పటి నుంచో చెబుతూనే వున్నామని, అదే నేడు నిజమైందని వైసీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లోనూ, ఆ తర్వాత కూడా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే తమ ఆరోపణలకు నేటి వారి కలయిక నిదర్శనమని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా వుండగా టీడీపీతో పొత్తు ప్రకటన నేపథ్యంలో జనసేన అభ్యర్థులపై కొత్త చర్చకు తెరలేచింది. జనసేనకు సీట్లు ఎన్ని అనేది అసలు చర్చనీయాంశ అంశమే కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ జనసేనకు ఒకే ఒక్క నాయకుడు పవన్‌కల్యాణ్ మాత్రమే అని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి నిర్మాణం లేదని గుర్తు చేస్తున్నారు. కావున పవన్‌కల్యాణ్ మినహా మిగిలిన జనసేన అభ్యర్థులందరిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే డిసైడ్ చేస్తారనే చర్చకు తెరలేచింది.
ఇది వినడానికి అతిశయోక్తిగా ఉన్నప్పటికీ, వాస్తవంగా జరిగేది ఇదే అని మెజార్టీ అభిప్రాయం. జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించినా, వాటిలో ఆ పార్టీ తరపున టీడీపీ నాయకులు బరిలో వుంటారని విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇందుకు పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావని అంటున్నారు.
ఎందుకంటే క్షేత్రస్థాయిలో తన పార్టీ బలం ఎంతో పవన్‌కు బాగా తెలుసని చెబుతున్నారు. కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం బలంగా ఉన్నచోట మాత్రమే జనసేనకు అంతోఇంతో నాయకత్వం ఉందనేది నిజం అంటున్నారు.
కావున జనసేన గుర్తుపై టీడీపీ నాయకులే రేపు ఎన్నికల్లో బరిలో వుంటారనే కోణంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. నిజానికి టీడీపీలో జనసేన విలీనం చేసి వుండేవాడని, అయితే ఆ పార్టీ గొంతుతో చెబితే తన మాటకు విలువ వుండదనే వ్యూహంతోనే తన పార్టీని పవన్ కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. కావున రానున్న ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయాలంటే ఆ పార్టీ నాయకులై వుండాల్సిన అవసరం లేదనేది మెజార్టీ అభిప్రాయం.