సమీక్ష: 90ఎంఎల్
రేటింగ్: 1.5/5
బ్యానర్: కార్తికేయ క్రియేటివ్ వర్క్స్
తారాగణం: కార్తికేయ, నేహ సోలంకి, రావు రమేష్, రవికిషన్, రోల్ రైడా, పోసాని కృష్ణమురళి, సత్యప్రకాష్, అజయ్, ప్రగతి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
ఛాయాగ్రహణం: జె. యువరాజ్
నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్రా
విడుదల తేదీ: డిసెంబర్ 5, 2019
'ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్'… ఇలాంటిదో వ్యాధి పుట్టిన పిల్లలకి వస్తుంటుందట. గర్భంతో వుండగా తల్లి మద్యపానం చేస్తే వచ్చే వ్యాధి అది. నిజమైన ఈ వ్యాధి రావడానికి అసలైన కారణాలు కానీ, నిజంగా ఆ వ్యాధి లక్షణాలు కానీ చూపించకుండా కేవలం తన కథాగమనానికి దాన్నొక 'టూల్'గా వాడుకున్నాడు ఎర్రా శేఖర్‌రెడ్డి. ఇలాంటిదో వ్యాధి చుట్టూ కథ నడిపించినపుడు అయితే దాని తాలూకు ఇబ్బందులతో స్ట్రగుల్ అయ్యే రియలిస్టిక్ హీరోని చూపించవచ్చు లేదా దాని వల్ల జీవితంలో ఎదురవుతోన్న సమస్యలతో నవ్వించే హీరోనైనా పరిచయం చేయవచ్చు. కానీ ఈ చిత్ర దర్శకుడు హీరోకి ఈ వ్యాధి ఆపాదించి కాలం చెల్లిపోయిన ఫార్మాట్‌లో చెప్పాడు.
ప్రతి పూట నైంటీ ఎంఎల్ మద్యం తాగే హీరోని చూసి… తాగుబోతులంతా తమకి కూడా ఇలాంటి వ్యాధి ఏదైనా వుంటే హ్యాపీగా తాగేసి తిరగవచ్చు కదా అని అనుకోవడానికి తప్ప ఈ పాయింట్ ప్రేక్షకులకి కనక్ట్ అయ్యేదేమీ లేదు. ఆర్‌ఎక్స్ 100 యూత్‌ని ఆకట్టుకోవడానికి కారణాలు ఏమిటనేది తెలుసు కనుక, ఈ డ్రింకిర్ కథ కూడా వారికి కనక్ట్ అవుతుందని కార్తికేయ ఎక్సయిట్ అయినట్టున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ప్రతి పూట మద్యం సేవించే హీరోని దాటి ఈ కథలో ఏముంది, ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది తర్కించుకుంటే కాస్త అర్థవంతమైన కథనం రాసుకునే వారు. మందు తాగే హీరో ఎవరితో ప్రేమలో పడాలి? అసలు మందు వాసనే పడని సువాసనని (హీరోయిన్ పేరు అదే) అతను ప్రేమించాలి. మందు వాసనని గుమ్మం దాటి లోనికి రానివ్వని ఆమె కుటుంబంలోకి పూటకో పెగ్గు పడకపోతే ప్రాణం మీదకొచ్చే హీరో ఎలా వెళ్లాలి?
కామెడీ కోసం దర్శకుడు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని ముఖ్య పాత్రలు మనం ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేని జోకర్లుగా కనిపించినా ఫర్వాలేదనుకున్నారు. హీరోయిన్ కుటుంబాన్ని ఎంతో కామెడీగా చూపించేస్తున్నామని భ్రమ పడ్డారే తప్ప రావు రమేష్ లాంటి సమర్ధుడైన నటుడు కూడా జాలి పడాల్సిన రీతిన అతని పాత్రని తీర్చిదిద్దినట్టు గ్రహించలేకపోయారు. విలన్‌తో వేయించిన బట్టలు, అతను రాత్రి పూట తాగేసి వేసే వేషాలు కూడా కామెడీనే అనుకున్నారు. అసలు అతడిని హీరో కొట్టడానికి, బదులుగా అతను పగబట్టడానికి కారణాలు చూస్తే ఈ విలన్ పాత్రని ఇంత అధ్వాన్నంగా రాసుకోవాలనే ఐడియా ఎవరికొచ్చిందో అనిపించక మానదు. తన తాగుడు గురించి తెలియకుండా దాచిపెట్టే హీరో ఖచ్చితంగా ఒక పాయింట్‌లో దొరికేస్తాడు (స్పాయిలర్ అనుకోకండి. ఇది ట్రెయిలర్‌లోనే చూపించేసారు) అనేది ముందే ఊహించవచ్చు. కనీసం ఆ దొరికేది అయినా ఫన్నీ ఇన్సిడెంట్ ద్వారా జరిగివుంటే కొంతయినా ఆక్షేపించవచ్చు. కానీ క్రియేటివిటీకి 90 కిమీ దూరంలో వుండాలని దర్శకుడు ఖచ్చితమైన నిబంధన పెట్టుకున్నట్టున్నాడు.
తనకున్న వ్యాధి గురించి హీరో ఒకసారి చెప్తే హీరోయిన్ కన్విన్స్ అయిపోతుంది. కానీ అలా చెప్పేస్తే అక్కడితో సినిమా అయిపోతుంది. అందుకని ఆ పాయింట్ జోలికి పోకుండా నాన్సెన్స్‌తో 90ఎంఎల్ నిండిపోయింది. ఎంతో నియమ నిబంధనలున్న వాడంటూ కామెడీ కోసమని 'సువాసన' తండ్రిని పరిచయం చేస్తే, చివరకు అతను కూతురి కోసం చూసిన పద్ధతైన మగాళ్లెవరు? ఎంతో గొప్పగా తీస్తున్నామనే గాట్టి నమ్మకం లేకపోతే ఈ చిత్రంలో చూపించే సన్నివేశాలని ఈ రోజుల్లో తెరకెక్కించడానికి ఎవరయినా జంకుతారు. సదరు సన్నివేశాలు నిర్మాత, హీరో ఆమోదం పొంది, కొందరు ఫ్రంట్‌లైన్ యాక్టర్ల సమ్మతంతో తెర మీదకి వచ్చాయంటే దర్శకుడు నిజంగానే సమర్ధుడు.
కార్తికేయ ఇంకా 'ఆర్‌ఎక్స్ 100' హ్యాంగోవర్‌లోనే వున్నట్టున్నాడు. తనని తాను మాస్ హీరో అనేసుకుంటున్నాడు. నాలుగైదు సినిమాలు చేసినా కానీ నటుడిగా ఇంకా నర్సరీ స్టేజీలోనే వున్నాడు. నేహ సోలంకి నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రావు రమేష్, రవికిషన్ లాంటి వారిని ఇలాంటి పాత్రల్లో చూసి జాలి కలుగుతుంది. సత్యప్రకాష్, ప్రగతిల నటన టీవీ సీరియల్‌ని తలపించగా, రోల్ రైడాలో నటుడున్నాడని ఎవరికి అనిపించిందో వారికి సన్మానం చేయాలి. గోలగోలగా వుండే పాటలు, అర్థంపర్ధం లేని మాటలు, అస్తవ్యస్తంగా వున్న కూర్పు వున్న ఈ చిత్రంపై ఇంత ఖర్చు పెట్టారంటే నిర్మాత గట్స్‌ని మెచ్చుకోవాలి.
తాగుబోతులు కూడా ఈ సినిమా టికెట్ కొనే బదులు ఒక పెగ్గేసి పడుకుంటే మేలనుకునిపించేలా వున్న ఈ '90 ఎంఎల్' మిగతా ప్రేక్షకులని ఇందులో అలీ పాత్ర అన్నట్టుగా 'దంచికొట్టి దండెం మీద ఆరేయడం' గ్యారెంటీ!
బాటమ్ లైన్: నాన్సెన్స్!
గణేష్ రావూరి