స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబును ఆయన భార్య నారా భువనేశ్వరి శుక్రవారం కలిసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బాబుతో ములాఖత్‌కు భువనేశ్వరి జైలు అధికారులను అనుమతి కోరారు. కానీ ఆమె అభ్యర్థనను జైలు అధికారులు తిరస్కరించడం గమనార్హం.
బాబుతో భువనేశ్వరి ములాఖత్‌కు అనుమతి ఇవ్వకపోవడాన్ని టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. ఇది ముమ్మాటికీ కక్షతో చేస్తున్నదే అని మండిపడుతున్నారు. వారంలో మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉంది. ఇప్పటికి బాబుతో రెండుసార్లు ములాఖత్ జరిగింది. ఒక దఫా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. మరోసారి పవన్‌కల్యాణ్, లోకేశ్, నందమూరి బాలకృష్ణ ములాఖత్‌లో చంద్రబాబును కలుసుకున్నారు. ఇంకా ఒక సారి కలిసేందుకు అవకాశం ఉంది.
కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ వ్యక్తిగత కారణాల రీత్యా రోజులు సెలవుపై ఉన్నారు. ఈ నెల 19న ఆయన విధుల్లో చేరనున్నారు. అంత వరకూ జైళ్లశాఖ కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ రవికిరణ్‌కు రాజమండ్రి జైలు బాధ్యతల్ని అప్పగించారు. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును ఆయన తిరస్కరించారని సమాచారం.
తన భర్తను కలవనీయకుండా అడ్డుకోవడం అమానవీయం అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం బాబుతో మరోసారి ములాఖత్‌కు అవకాశం ఉన్నా ఎందుకు అనుమించడం లేదని ఆమె నిలదీయడం విశేషం.