మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై చర్చ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో గత శనివారం చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఐదు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా కాలం వెళ్లదీస్తున్నారు. బాబు అరెస్ట్‌పై అటు, ఇటూ తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. బాబు పాపాలు పండాయని ఒక వర్గం అంటుంటే, కక్షతోనే ఆయన్ను జైలుకు పంపారని మరో వర్గం గట్టిగా వాదిస్తోంది.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌పై చర్చ పక్కకు పోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్యే కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గురువారం నోటీసులు ఇవ్వడంతో చర్చ అటు వైపు మళ్లింది. ఇప్పటికే పలుమార్లు కవితను ఈడీ విచారించింది. అప్పట్లో కవితను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అలాంటిదేదీ జరగలేదు. దీంతో బీఆర్ఎస్తో బీజేపీ మిలాఖత్ అయ్యిందని, అందుకే కవితను అరెస్ట్ చేయలేదంటూ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగింది.
లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ అరెస్ట్ చేయకపోవడం తెలంగాణలో రాజకీయంగా బీజేపీని దెబ్బ తీసిందనే వాదన కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో రెండుమూడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న పరిస్థితిలో కవితకు ఈడీ నోటీసులు మళ్లీ ఆమె అరెస్ట్‌పై చర్చకు దారి తీశాయి. దీంతో చంద్రబాబు అరెస్ట్ అంశం పాతదై పోయింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పది రోజులు సమయం తీసుకునైనా కవిత విచారణకు రావాల్సిందే అని సుప్రీంకోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం వర్సెస్ ఈడీ పిటిషన్‌తో పాటు కవిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు జత చేయడం గమనార్హం. వీటన్నింటిపై వాదనలు వినడానికి సుప్రీంకోర్టు సిద్ధమైంది. దీంతో కవిత పిటిషన్ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? ఈ దఫా ఆమె అరెస్ట్ వుంటుందా? అనే చర్చకు తెరలేచింది.