కారుతో ఢీకొట్టి.. 11 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి…!

కారుతో యాక్సిడెంట్ చేయడమే కాదు, ఓ వ్యక్తిని ఏకంగా 11 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు ఆ కారు డ్రైవర్. చివరకు ఓ టోల్ గేట్ దగ్గర కారు ఆగడంతో దానికింద మృతదేహం ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు.…

కారుతో యాక్సిడెంట్ చేయడమే కాదు, ఓ వ్యక్తిని ఏకంగా 11 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు ఆ కారు డ్రైవర్. చివరకు ఓ టోల్ గేట్ దగ్గర కారు ఆగడంతో దానికింద మృతదేహం ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. అప్పటి వరకు ఆ విషయం కారు డ్రైవర్ కి కూడా తెలియకపోవడం బాధాకరం. ఉత్తర ప్రదేశ్ లోని మధుర సమీపంలో యమున ఎక్స్ ప్రెస్ వే పై ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ ఢిల్లీకి చెందిన వీరేందర్ సింగ్ గా గుర్తించారు.

ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని కారుతో ఢీకొట్టి వాహనంతోనే ఆమెను లాక్కెళ్లిన ఘటన మరచిపోకముందే అలాంటి ఘటనే యూపీలో రిపీట్ అయింది. అయితే ఇక్కడ ఆ తప్పు ఉద్దేశపూర్వకంగా జరగలేదనే వాదన వినిపిస్తోంది. కనీసం యాక్సిడెంట్ జరిగిన విషయం కూడా కారు డ్రైవర్ తనకి తెలియదంటున్నారు పోలీసులు. ఆ కారు శవాన్ని 11 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. టోల్ గేట్ దగ్గర కారు ఆగడంతో విషయం బయటపడింది.

కారు డ్రైవర్ వీరేందర్ సింగ్ ఆగ్రా నుంచి నొయిడా వైపు తన భార్యతో కలసి వెళ్తున్నాడు. యమున ఎక్స్ ప్రెస్ వే పై దట్టమైన మంచు ఉండటంతో అసలు ఏం జరిగిందో కూడా కారు డ్రైవర్ కి తెలియలేదు. ఒకవేళ ప్రమాదం జరిగినా.. దాన్ని తప్పించుకోడానికి మరింత స్పీడ్ గా ముందుకు వెళ్లి ఉంటాడు. చివరకు టోల్ గేట్ దగ్గర బుక్కయ్యాడు. అయితే సమీప గ్రామాల్లో ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరిగినట్టు గ్రామస్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

చివరకు కారు నుంచి శవం బయటపడిన తర్వాత పోలీసులు ఎంక్వయిరీ కోసం వెళ్లగా ఓచోట రక్తపు మడుగు కనిపించడంతో అక్కడ యాక్సిడెంట్ జరిగిందని నిర్థారించారు. టోల్ గేట్ కి ప్రమాదం జరిగిన ప్రాంతానికి 11 కిలోమీటర్లు దూరం ఉంది. ఆ మృతదేహం ఎవరిదనేది ఇంకా గుర్తించలేదు.