ఢిల్లీ టూర్ ఫలితం.. పెయిడ్ ఆర్టిస్ట్ గా పవన్

పవన్ కల్యాణ్ ఆ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చారు. వెళ్లారు, వచ్చారు.. ఇదే అందరికీ తెలిసింది. అక్కడ ఏం చేసిందీ, ఎవరిని కలిసిందీ, అసలు ఎందుకు వెళ్లిందీ ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కనీసం ట్విట్టర్లో…

పవన్ కల్యాణ్ ఆ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చారు. వెళ్లారు, వచ్చారు.. ఇదే అందరికీ తెలిసింది. అక్కడ ఏం చేసిందీ, ఎవరిని కలిసిందీ, అసలు ఎందుకు వెళ్లిందీ ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కనీసం ట్విట్టర్లో కూడా ఎలాంటి అప్ డేట్స్ లేవు, ఏ మీడియాలోనూ లీకులు రాలేదు, ఏం చేశారనే ఊహాగానాలు కూడా లేవు.

కట్ చేస్తే.. ఢిల్లీ టూర్ తర్వాత పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే చాలా తేడా కనిపిస్తోంది. మనిషిలో పూనకం పాళ్లు పెరిగాయి. ఊగడం ఎక్కువైంది, అరుపులు, కేకలు కూడా అంతకు మించి కనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే బీజేపీపై సానుభూతి బాగా కనిపిస్తోంది. అమిత్ షా అంటే గౌరవం అంటున్నారు. నేనెప్పుడూ కమలానికి దూరం కాలేదంటున్నారు. పోనీ లోపలి మనిషి ఇప్పుడే బైటకొచ్చాడనుకుందాం. ఎన్నికలైన ఆరు నెలల తర్వాత అదీ ఢిల్లీ టూర్ తర్వాత పవన్ లో వచ్చిన మార్పు చాలా అనుమానాలకు తావిస్తోంది.

దీంతో ఢిల్లీ టూర్ పై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అక్కడ బీజేపీతో జనసేనాని జరిపిన బేరసారాలు బైటపడుతున్నాయి. ఏపీలో వైసీపీని, జగన్ ని తీవ్రస్థాయిలో విమర్శించాలని, అదే సమయంలో కేంద్రంలో ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబివ్వాలని బీజేపీ డైరక్షన్ ఇచ్చినట్టుంది. ఆ డైరక్షన్ ప్రకారమే ఈ యాక్టర్ ఇక్కడ చెలరేగిపోతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి ఇలాకాలో టూర్ పెట్టుకుని మరీ రెచ్చిపోయి మాట్లాడారు, జనసైనికుల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు.

దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఏపీ కొరకరాని కొయ్యలా మారింది. చంద్రబాబుని అదిరించి, బెదిరించి పనులు చేయించుకోవచ్చు కానీ, జగన్ తో వ్యవహారం అంత ఈజీ కాదని బీజేపీకి తొందరగానే తెలిసొచ్చింది. పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్లను రద్దు చేయడం వంటి వ్యవహారాలతో కేంద్రాన్ని నేరుగా ఢీకొంటున్నారు జగన్.

అందుకే ఓ వ్యూహం ప్రకారం పవన్ ని వాడుకుంటోంది బీజేపీ. ఈ అగ్రిమెంట్ ఢిల్లీలోనే కుదిరింది. ప్రస్తుతానికి రాయలసీమ టూర్ శాంపిల్ మాత్రమే.. ముందు ముందు రాష్ట్రంలో మరింత అలజడి సృష్టించేందుకు పవన్ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పాలిటిక్స్ లో ఉన్న ఎంతోమంది పెయిడ్ ఆర్టిస్టుల్లో పవర్ స్టార్ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు.