లిక్కర్ కార్డు: మందు బాబులకు మరో షాక్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ మందుబాబులకు మరో షాక్ ఇచ్చింది. మద్య నియంత్రణలో భాగంగా మరిన్ని చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే సగానికి సగం బార్లు, పూర్తిస్థాయిలో బెల్ట్ షాపులు ఎత్తేసిన జగన్ సర్కార్..  ఇప్పుడు మద్యం కోసం…

ఆంధ్రప్రదేశ్ సర్కార్ మందుబాబులకు మరో షాక్ ఇచ్చింది. మద్య నియంత్రణలో భాగంగా మరిన్ని చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే సగానికి సగం బార్లు, పూర్తిస్థాయిలో బెల్ట్ షాపులు ఎత్తేసిన జగన్ సర్కార్..  ఇప్పుడు మద్యం కోసం కార్డులు ప్రవేశపెట్టబోతోంది. రేషన్ కోసం రేషన్ కార్డు ఎలాగో, మద్యం కోసం మద్యం కార్డు అన్నమాట.

ఇకపై మద్యం కొనాలంటే చేతిలో వంద లేక 200 ఉంటే సరిపోదు. అక్షరాలా 5వేల రూపాయలు ఉండాల్సిందే. అవును.. 5వేలు పెట్టి లిక్కర్ కార్డు కొనుక్కోవాలి. ఆ కార్డు ఉంటేనే మద్యం కొనడానికి వీలవుతుంది. కార్డులో డబ్బు అయిపోయిన వెంటనే మళ్లీ రీచార్జ్ చేసుకోవాలన్నమాట. ఇలా మందుబాబులకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది సర్కార్.

ఇక్కడితో కథ ముగియలేదు. ఎవరికిపడితే వాళ్లకు కార్డు ఇవ్వరు. పాతికేళ్లు నిండి, మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్లకే కార్డులు ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. లిక్కర్ కార్డుల వల్ల ప్రభుత్వానికి రెండు ఉపయోగాలు. తలో 5వేలు కట్టాలి కాబట్టి, నిధుల సమీకరణ జరుగుతుంది. రెండోది ఒకేసారి 5వేలు పెట్టాల్సి రావడంతో మందుబాబులు వెనక్కి తగ్గే వీలుంది.

ప్రస్తుతానికి ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై ముఖ్యమంత్రి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మాత్రం లిక్కర్ కార్డులు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.