2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ను జనం అఖండ మెఙారిటీ కట్టబెట్టి సిఎమ్ ను చేసారు. దీనికి పలుకారణాలు వున్నాయి. తొలిసారి ఓ యువ నాయకత్వం కళ్ల ముందు కనిపించడం, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే ఆలోచన, నవరత్నాలు అనే హామీలు. వీటితో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి.
అధికారంలోకి వచ్చిన తరువాత సిఎమ్ గా జగన్ నవరత్నాల మీద కీలక దృష్టి పెట్టారు. ఆ విధంగా తన ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటూ, హామీలను నిలబెట్టుకుంటున్నా అనే కీర్తిని పొందాలని చూసారు. అంతవరకు బాగానే వుంది. కానీ మిగిలన వ్యవహారాల మాటేమిటి?
ఓ యువ నాయకత్వం మీద జనాలు పెట్టుకున్న నమ్మకం సంగతేమిటి? దానిని ఏ మేరకు నిలబెట్టుకుంటున్నారు. వైవిధ్యమైన నిర్ణయాలు రాష్ట్ర ప్రగతి కోసం ఏం తీసుకున్నారు అని ఆలోచిస్తే ఏమీ కనిపించవు. విప్లవాత్మక నిర్ణయాలు ఏమైనా రాష్ట్రం కోసం తీసుకున్నారా అని చూసుకుంటే ఏమీ కనిపించడం లేదు. సరే ఆ సంగతి పక్కన పెడితే ఓటు బ్యాంక్ లో కీలకమైన ఉద్యోగవర్గాన్ని పట్టించుకోవడమే మానేసారు.
కాపులు, బిసిలు, ఎస్సి ఎస్టీలు ఇలా ఉద్యోగలు కూడా ఓ ఓటు బ్యాంక్ అన్న సంగతి రాష్ట్రంలో అనేక సార్లు రుజువు అయింది. చంద్రబాబును దించడంలో, గద్దె ఎక్కించడంలో ప్రభుత్వ ఉద్యోగులది కీలకపాత్ర అన్నది అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్ల పాత్ర ఏ ఎన్నికల్లోనూ విస్మరించలేనిది.అందుకే ప్రభుత్వాలు వాళ్ల సహేతుకమైన డిమాండ్లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తొ వుంటాయి.
కానీ జగన్ ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వున్నట్లు కనిపిస్తోంది. దాదాపు గత రెండున్నరేళ్లుగా ఉద్యోగుల డిఎ ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వారు సైలంట్ గా వుండడాన్ని ఉదాసీనతగా తీసుకుంటున్నారు. హామీలు, డేట్ లు ప్రకటించి కూడా విస్మరించారు. పేరివిజన్ సంగతి చెప్పనక్కరేలేదు.
నవరత్నాల విషయంలో ఎక్కడ లేని అప్పులు చేస్తున్న ఆయన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం ఎందుకు ఆ దిశగా వెళ్లడం లేదో తెలియడం లేదు. ఏదో విధంగా జగన్ అను అన్ పాపులర్ చేసి, 2024లోగానే కిందకు దింపేయాలన్నంత తాపత్రయం పడుతున్న ప్రతిపక్షం వుందని తెలిసి కూడా జగన్ ఇలాంటి పరిస్థితి కొనితెచ్చుకుంటున్నారు అంటే ఏమనుకోవాలి? మొండి తనం అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? లేదా మరేదో వ్యూహం వుందనుకోవాలా?
ఉద్యోగులను దూరం చేసుకున్న ఏ ప్రభుత్వమూ ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు తక్కువు. ఈ విషయం జగన్ కు తెలియనిదా? లేక ఈ నిర్లక్ష్యం వెనుక భరోసా ఏమిటి? అది ఏమయినా ప్రస్తుతానికి కాదు ఎప్పటికీ ఆత్మహత్యా సదృశమే. కానీ ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఉద్యోగులు చంద్రబాబా? జగన్ నా అంటే జగన్ వైపే మొగ్గుతారు. అది కూడా జగన్ వాళ్ల సమస్యలు పరిష్కరిస్తే, కానీ అది విస్మరిస్తే జగన్ ను పక్కన పెట్టడం ఉద్యోగులకు తక్షణ కర్తవ్యం అవుతుంది.
ఉద్యోగులు దూరం అయినంత మాత్రాన ఏమిటి? తన ఓటు బ్యాంకు తనకు వుంది అని జగన్ ధీమా పడితే, అది పక్కా తప్పుడు నిర్ణయం అవుతుంది అన్నది. అది కనిపిస్తున్న భవిష్యత్.