పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి అక్టోబర్ 21, 2021 నాటికి ఉన్న 2,087 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ను కోరగా 711 కోట్ల రూపాయల విడుదలకు మాత్రమే పీపీఏ సిఫార్సు చేసినట్లు కేంద్ర జలశక్తి శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు రాజ్యసభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో అసాధారణ జాప్యం, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
బిల్లుల స్క్రూటినీలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరవలసి రావడం, నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ వంటి పలు కారణాల వలన బకాయిల చెల్లింపులలో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుంది. వాటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తారు. ఆర్ధిక శాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్ మార్కెట్ నుంచి సేకరిస్తుంది.
మార్కెట్ నుంచి నిధుల సేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. సేకరించిన నిధులను నాబార్డ్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి అక్కడి నుంచి పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. నిధుల బదిలీ ప్రక్రియ సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు.