ఒమిక్రాన్.. ఫార్మా కంపెనీల ప్రొప‌గాండానా?

స‌రిగ్గా ప్ర‌పంచం క‌రోనాను సీరియ‌స్ గా తీసుకోవ‌డం మానేస్తున్న ద‌శ‌లో కొత్త వేరియెంట్ ప్ర‌చారం ఊపందుకోవ‌డం యాధృచ్ఛిక‌మేనా? ఒక డోసు  వేయించుకున్న వాళ్లు ఒక డోసుతో, రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు రెండు…

స‌రిగ్గా ప్ర‌పంచం క‌రోనాను సీరియ‌స్ గా తీసుకోవ‌డం మానేస్తున్న ద‌శ‌లో కొత్త వేరియెంట్ ప్ర‌చారం ఊపందుకోవ‌డం యాధృచ్ఛిక‌మేనా? ఒక డోసు  వేయించుకున్న వాళ్లు ఒక డోసుతో, రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు రెండు డోసుల‌తో..తాము ఇక సేఫ్ అనుకుంటున్న త‌రుణంలో, బూస్ట‌ర్ డోసుల వ్యాపారం కోసమే ఒమిక్రాన్ ప్ర‌చారం ఊపందుకుంటోందా? క‌రోనా వ్యాక్సిన్ ను ప్ర‌జ‌లు లైట్ తీసుకుంటున్న త‌రుణంలోనే ఈ భ‌యాందోళ‌న‌లు పెరుగుతుండటం వెనుక ఫార్మా దందా ఉందా? ఒమిక్రాన్ వార్త‌లు రాగానే.. క‌రోనా నివార‌ణ వ్యాక్సిన్ల‌ను త‌యారు చేస్తున్న ఫార్మా కంపెనీల షేర్లు రేసు గుర్రాల‌య్యాయి! వాటి మార్కెట్ విలువ గ‌త నాలుగైదు రోజుల వ్య‌వ‌ధిలోనే భారీగా పెరిగింద‌నే వార్త‌లూ వ‌స్తున్నాయి! వీట‌న్నింటినీ ప్ర‌జ‌లు ఎలా చూడాల‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశ‌మే!

ఈ విష‌యంలో అంత‌ర్జాతీయ స్థాయి విశ్లేష‌ణ‌ల నుంచి సోష‌ల్ మీడియా ఎన‌లిస్టుల వ‌ర‌కూ ర‌క‌ర‌కాల సందేహాల‌ను వెలిబుచ్చుతున్నారు. ప్ర‌త్యేకించి బూస్ట‌ర్ డోసు అమ్మ‌కాల కోసం ఒమిక్రాన్ ప్ర‌చారాన్ని ఊపందుకునేలా చేశార‌నే విశ్లేష‌ణ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో బూస్ట‌ర్ డోస్ గురించి ప్ర‌భుత్వాలే ప్ర‌చారం చేసి పెడుతున్నాయి. రెండు  డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు కూడా బూస్ట‌ర్ డోస్ ను వేయించుకోండ‌నే ప్ర‌చారం గ‌ట్టిగా ఉంది. అయితే ప్ర‌జ‌లు మాత్రం దానికంత సానుకూలంగా లేరు!

ఇక ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వ‌చ్చిందంటే.. ఇండియాలో కూడా అప్పుడే బూస్ట‌ర్ డోస్ గురించి చ‌ర్చ మొదలైంది. ప్ర‌భుత్వం ఉచితంగా ఇస్తున్నా చాలా మంది రెండో డోసు వ్యాక్సిన్ ప‌ట్ల ఉత్సుక‌త‌తో లేరు. కొన్ని కోట్ల మంది సెకెండ్ డోస్ ను మిస్ అయ్యార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే చెబుతున్నాయి. ప్ర‌జ‌ల‌ను బ‌తిమాలి మ‌రీ ప్ర‌భుత్వాలు ఇక్క‌డ సెకెండ్ డోస్ ను వేసేందుకు ప్రయాస ప‌డుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. ఇండియాలో బూస్ట‌ర్ డోస్ గురించి చ‌ర్చ మొదలైంది. కొత్త వేరియెంట్ అన‌గానే.. ఆల్రెడీ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ల‌లో కూడా కొంద‌రు భ‌య‌ప‌డ‌టం మొద‌లైంది! ఈ సారి ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయో అనే భ‌యం ఒక‌టి మొద‌లైంది. దీనికి తోడు.. డ‌బ్ల్యూహెచ్వో తో స‌హా అనేక సంస్థ‌లు ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌ల‌ను పెంచే ప్ర‌క‌ట‌న‌లే చేస్తున్నాయి. అయితే వాటికేమీ కాల‌జ్ఞానం తెలియ‌దు. ముందే భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా ప్ర‌క‌ట‌న‌లు చేసేస్తే ఒక ప‌ని అయిపోతుంద‌నే లెక్క‌లూ ఉండ‌వ‌చ్చు!

డ‌బ్ల్యూహెచ్వోనే కాదు.. దేశాల ప్ర‌భుత్వాల‌నే ఫార్మా సంస్థ‌లు ప్ర‌భావితం చేస్తాయ‌నే మాట కొత్త‌దేమీ కాదు. త‌మ మార్కెట్ కోసం ఫార్మా మాఫియా ఎంత‌కైనా తెగిస్తుంది, ఏ ప‌ని అయినా చేయిస్తాయ‌నే అభిప్రాయాలున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. ఒమిక్రాన్ వేరియెంట్ గురించి విప‌రీత స్థాయి ప్ర‌చారం ఫార్మా కంపెనీల మార్కెటింగ్ వ్యూహ‌మేనే విశ్లేష‌ణ‌లో వాస్త‌వ‌మెంత అనేదానికి రానున్న ప‌క్షం, నెల రోజుల వ్య‌వ‌ధిలోనే స్ప‌ష్ట‌త రావొచ్చు!