మరోసారి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఓమిక్రాన్ వేరియంట్ శరవేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోందన్న ఆందోళన ప్రభుత్వాల్ని, ప్రజానీకాన్ని అప్రమత్తం చేస్తోంది. మహమ్మారి పీడ విరగడైందని ప్రపంచమంతా రిలాక్ష్ అవుతున్న నేపథ్యంలో రూపం మార్చుకుని విరుచుకపడేందుకు వస్తున్న ఓమిక్రాన్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ఎన్నారైలు, విదేశీ పౌరులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓమిక్రాన్ అరికట్టే క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా భారత్‌కు వచ్చే వారు తమ ప్రయాణ తేదీ కంటే ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీని ఎయిర్ సువిధా పోర్టల్‌లో నమోదు చేయాలి. ప్రయాణ తేదీకి 72 గంటల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్టును స్వచ్ఛందంగా సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు అవసరమైతే ప్రభుత్వం నిర్దేశించినట్టుగా క్వారంటైన్లో ఉంటామని సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలి.
ఇక భారత ప్రభుత్వం ‘అట్ రిస్క్’గా ప్రకటించిన జాబితాలోని దేశాల ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ టెస్టులో నెగటివ్ రిపోర్టు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందే.
ఎనిమిదో రోజు టెస్ట్‌లో నెగటీవ్ వస్తే.. మరో ఏడు రోజుల పాటు సెల్ఫ్ మానిటరింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎయిర్ పోర్టులో జరిపే సెల్ఫ్ పెయిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ సెంటర్‌కి తరలించి వైద్య సాయం అందిస్తారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో పాటు వాటి కాంటాక్టులుగా తేలిన అందరినీ హోం క్వారెంటైన్ చేస్తారు.
ఈ రిస్క్ అంతా ఎందుకని భావిస్తే… ప్రయాణాలు మానుకుని హాయిగా తామున్న ప్రాంతంలోనే ఉండడం మంచిది. ఒకవేళ అత్యవసరమనిపిస్తే మాత్రం ఇలాంటి పరీక్షలన్నీ ఎదుర్కొని మాత్రమే భారత్‌లో అడుగు పెట్టాల్సి వుంటుంది. నిబంధనలు మాత్రం ఖచ్చితంగా అమల్లో వుంటాయి. కావున భారత్‌లో పర్యటించాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్లెవరైనా… ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల గురించి తెలుసుకుంటే మంచిది.