జేడీకి ఆ పార్టీయే ఏకైక ఆప్షన్…?

జేడీ లక్ష్మీ నారాయణ. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేని పేరు. ఒక సినీ సెలిబ్రిటీకి వచ్చిన ఇమేజ్ ని ఆయన జగన్ కేసులను సీబీఐ అధికారిగా చూస్తూ సొంతం చేసుకున్నారు. ఒక సెక్షన్…

జేడీ లక్ష్మీ నారాయణ. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేని పేరు. ఒక సినీ సెలిబ్రిటీకి వచ్చిన ఇమేజ్ ని ఆయన జగన్ కేసులను సీబీఐ అధికారిగా చూస్తూ సొంతం చేసుకున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన్ని అలా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ప్రొజెక్ట్ చేసింది అని కూడా చెప్పాలి. జేడీ అన్నది సీబీఐలో ఆయన అధికారిక హోదా. ఇంటి పేరు వీవీ అయినా కూడా చివరికి జేడీగానే ఆయన ఫ్యామస్ అయ్యారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన మహారాష్ట్ర సీబీఐ విభాగంలో అత్యున్నత క్యాడర్ అధికారిగా ఉంటూ వాలంటరీగా రిటైర్ అయ్యారు. ఆ తరువాత ఆయన ఏపీ అంతా టూర్ చేశారు. సొంతంగా పార్టీ పెడతారు అని కూడా ఆ రోజుల్లో ప్రచారం సాగింది. మరో వైపు ఆయన లోక్ సత్తా పార్టీకి సారధి అవుతారని ఊహాగానాలు సాగాయి. ఇక బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అని కూడా చెప్పుకున్నారు.

ఇంకో వైపు టీడీపీలో చేరుతారు అన్నారు. అయితే ఇవేమీ జరగలేదు. అనూహ్యంగా జేడీ జనసేనలో చేరి విశాఖ ఎంపీ అభ్యర్ధి అయ్యారు. ఆయన బాగానే పోటీ ఇచ్చారు. చివరికి ఓడారు. ఓడినా విశాఖలోనే ఉంటానని చెప్పిన జేడీ సిటీలో ఒక ఇల్లు తీసుకున్నారు. ఆయన తరచూ విశాఖ‌ వస్తూ ఉంటారు. మొత్తానికి తన రాజకీయ కార్యక్షేత్రం విశాఖ అని జేడీ చెప్పేశారు.

ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్నది జేడీ ఆశ, ఆశయం. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి. జేడీ జనసేన నుంచి ఆ మధ్య బయటకు వచ్చేశారు. అయితే తాజాగా పవన్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సపోర్ట్ గా విశాఖలో మీటింగ్ పెడితే జేడీ మద్దతు ఇచ్చారు. దీంతో ఆయన రాజకీయం ఎటు వైపు అన్న చర్చ అయితే సాగుతోంది.

తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో జేడీ మాట్లాడుతూ తనకు అన్ని వైపులా ఆఫర్లు ఉన్నాయని అన్నారు. అయితే అందులో టీడీపీ లేదు, వైసీపీ ఉంది. బీజేపీ వైపు కూడా ఆయన చూపు ఉంది. అయితే ఏపీలో బీజేపీ బలం నిల్. ఇక జగన్ కేసులను విచారించిన అధికారిగా ఆ పార్టీలో చేరడానికి ఆయనకు ఏవో అభ్యంతరాలు ఉన్నట్లుగా ప్రచారం అవుతోంది. 

వైసీపీ నేతలు అయితే ఇప్పటికే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారుట. ఆ మధ్య జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన మీద కొంత అనుకూలంగా మాట్లాడిన జేడీ రూట్ వైసీపీ వైపే అనుకున్నా ఇపుడు అసలు కానే కాదు అంటున్నారు.

మొత్తానికి పవన్ పిలిస్తే తాను జనసేనలో చేరే విషయం ఆలోచిస్తాను అంటూ జేడీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఆయనకు ఏకైక ఆప్షన్ జనసేనగానే ఉంది అంటున్నారు. అటు టీడీపీలో ఆయన‌ చేరలేరని చెబుతున్నారు. జగన్ మీద టీడీపీ వారే కేసులు పెట్టించారని, జేడీ టీడీపీ మనిషి అని విమర్శలు ఉన్న క్రమంలో టీడీపీలో చేరి తన ఇమేజ్ ని జేడీ డ్యామేజ్ చేసుకోలేరు అంటున్నారు. 

మొత్తానికి పవన్ ఓకే అంటే జేడీ జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ టీడీపీ పొత్తులో భాగంగా ఆయన విశాఖ ఎంపీగా మరో మారు బరిలో నిలవడం ఖాయమని కూడా చెబుతున్నారు. సో తొందరలో ఈ మాజీ ఐపీఎస్ అధికారి పొలిటికల్ రీ ఎంట్రీ మీద క్లారిటీ రావచ్చు అంటున్నారు.